మంచిర్యాల అర్బన్/ పెద్దపల్లి రూరల్/ వికారాబాద్ ఆగస్టు 12 : లంచం డిమాండ్ చేసిన అవినీతి అధికారులను మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. చెన్నూర్ మండలం అంగరాజుపల్లి పీహెచ్సీ జూనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీనివాస్.. కోటపల్లి పీహెచ్సీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. గతేడాది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)గా ఉద్యోగ విరమణ పొందిన తోట వెంకటేశ్వర్లు రెండు నెలల డీఏ కోసం శ్రీనివాస్‌ను సంప్రదించగా రూ.6 వేలు డిమాండ్ చేసి పట్టుబడ్డాడు.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని ఓ రైతు సర్వే రిపోర్టు కోసం సర్వేయర్ సునీల్‌ను కోరగా రూ.20 వేలు డిమాండ్ చేయగా రూ.10వేలను ప్రైవేట్ సర్వేయర్‌కు ఫోన్‌పే చేసి దొరికిపోయాడు. వికారాబాద్ జిల్లా వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు 2ఎకరాల అసైన్డ్ భూమిని తల్లి పేరిట మార్చేందుకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలని రెవెన్యూ ఈ-సెక్షన్ ఉద్యోగి సుజాతను కలిశాడు. ఆమె రూ.20 వేలు డిమాండ్ చేసి రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.