Dr ABRP Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ ) : హిమాలయాల్లో ట్రెక్కింగ్ అంటే మాములు విషయం కాదు. అందులోనూ 70 ఏండ్ల వయసులో ఓ డాక్టర్ ఈ ఘనతను సాధించాడు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి ఏకంగా 12వేల అడుగుల ఎత్తయిన దయారా బుగ్యల్ అనే శిఖరాన్ని అధిరోహించి ఔరా అనిపించాడు. అతడితో పాటు కూతురు సింధు కూడా ఈ యాత్ర పూర్తిచేసింది.
అసలే చలికాలం.. అందులోనూ ఏడు పదుల వయస్సులో ఈ ఘనతను సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇదే స్ఫూర్తితో 18వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తానని డాక్టర్ ఏబీఆర్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యం, క్రమశిక్షణ, వ్యాయామంపై ప్రత్యేక దృష్టి వల్లే విజయవంతంగా పూర్తిచేసినట్టు వివరించారు. తన కూతురు ఎంతో ప్రేరణనిచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఐదుసార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసినట్టు తెలిపారు.