Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు సంక్షోభం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఫిబ్రవరిలోనే గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదయిన నేపథ్యంలో రానున్న కాలంలో గడ్డుపరిస్థితులు తప్పేలాలేవని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు 308-310 మిలియన్ యూనిట్లు కాగా దీంట్లో ఇతర రాష్ర్టాల నుంచి కొంటున్నది 159 మిలియన్ యూనిట్లు. అంటే సగానికి పైగా విద్యుత్తును కొనాల్సి వస్తున్నది. వేసవి వచ్చే వరకు ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోతలు తప్పేలాలేవని నిపుణులు చెప్తున్నారు. కాంగ్రెస్ గత పాలనలో పేలిపోయే సబ్స్టేషన్లు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి పునరావృతం కానుందా? అని రైతు సంఘాల నేతలు వాపోతున్నారు.
రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 16,506 మోగావాట్లుగా నమోదైంది. మొత్తం విద్యుత్తు డిమాండ్‌లో వ్యవసాయం రంగం నుంచి 34 శాతం, గృహ, వాణిజ్యరంగాల నుంచి 66 శాతం డిమాండ్ ఉంటుంది. ఎండకాలం మనకు విద్యుత్తు ఇస్తున్న ఇతర రాష్ర్టాల్లోనూ డిమాండ్ పెరుగుతుంది. ఆయా రాష్ర్టాలు విద్యుత్తు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మన దగ్గర ఉత్పత్తిపై దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రం అంధకారమయ్యే దుస్థితి నెలకొన్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఖాళీ అయ్యాయి. భూగర్భజలాలు అడుగంటాయి. చెరువుల్లోనూ నీటిలభ్యత తగ్గింది. కాలువల ద్వారా పారకం తగ్గింది. యాసంగి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. పంటలు కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావుల మీద ఆధారపడుతున్నారు. దీంతో పంపుసెట్ల వినియోగం పెరిగింది. గృహ వినియోగానికి సంబంధించి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం పెరుగుతున్నది. పెరిగిన విద్యుత్తు సరఫరా డిమాండ్‌ను తట్టుకోవాలంటే వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. కానీ అందుకు కూడా విద్యుత్తు సంస్థలు సన్నద్ధంగా లేవని సమ్మర్ యాక్షన్ ప్లాన్ పురోగతి స్పష్టంచేస్తున్నదని నిపుణులు చెప్తున్నారు.
ఒక రాష్ట్రం నుంచి విద్యుత్తును మరో రాష్ట్రం వాడుకుని, మళ్లీ అవసరమైనప్పుడు తీసుకునే పవర్ స్వాప్ అగ్రిమెంట్ (బ్యాంకింగ్) విధానం అమల్లో ఉంది. ఇందులోభాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1000-2,500 మోగావాట్ల సామర్థ్యం గల పవర్ బ్యాంకింగ్ గడువు ఈ నెల 28తో ముగియనుంది. 1500-3000 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ బ్యాంకింగ్ గడువు మార్చి 31తో ముగియనుంది. మధ్యప్రదేశ్ నుంచి 150 మెగావాట్ల విద్యుత్తు బదిలీ గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. 500 మెగావాట్లకు సంబంధించిన గడువు ఏప్రిల్ 30తో పూర్తవుతుంది.
వేసవి విద్యుత్తు డిమాండ్‌ను అదిగమించేందుకు సమ్మర్ యాక్షన్‌ప్లాన్ పేరుతో డిస్కంలు చేపట్టిన పనులేమీ కొలిక్కి రాలేదు. ప్రణాళికలో భాగంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల బిగింపు, 33 కేవీ, 11కేవీ ఫీడర్లను మార్చడం వంటి పనులు చేయాలని నిర్ణయించారు. కానీ ఏ పనులు కూడా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో డిమాండ్ మరింత పెరిగితే విద్యుత్తు వ్యవస్థలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు తట్టుకుంటాయా? అని అధికారులు కూడా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు వినియోగంపై ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, ట్రాన్స్‌కో చెప్తున్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. ఫిబ్రవరి 26న గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 16,506 మెగావాట్లకు చేరినట్టు ట్రాన్స్‌కో వెబ్సైట్ స్పష్టం చేసింది. కానీ, 16,601 మెగావాట్లుగా ఉన్నట్టు ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం ప్రకటించారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్యలో విద్యుత్తు వినియోగం అధికంగా ఉంటుంది. ఆ సమయంలో గరిష్ఠ డిమాండ్ 16 వేల మెగావాట్లకు చేరి 7-8 నిమిషాల కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 7:52 గంటల సమయంలో గరిష్ఠ డిమాండ్ 16,387 మెగావాట్లకు చేరి, తర్వాత తగ్గుముఖం పట్టింది. రాత్రి 6:45కు 9,709 మెగావాట్లకు పడిపోయింది.
అత్యవసర సర్వీసులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. మార్చిలో గరిష్ఠ డిమాండ్ 17,500 మెగావాట్లకు చేరొచ్చని చెప్పారు.