హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పడానికి ఇటీవల ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదికే సాక్ష్యం. కేసీఆర్ దిశానిర్దేశంలో పోలీసులు తమ విధులను ఎంతో సమర్దంగా నిర్వహించారనడానికి ఎన్సీఆర్బీ క్రైమ్ నివేదిక కీలకంగా మారింది. తెలంగాణలో 2023లో 954 హత్యలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా మర్డర్లు ఎక్కువగా జరిగిన టాప్-10 రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. కర్ణాటక పదో స్థానంలో ఉన్నది.
అయితే, తెలంగాణలో నాడు శాంతిభద్రలు అదుపులోనే ఉన్నాయని చెప్పడానికి హత్యల విభాగంలో తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా పోలీసు విధులను విస్తరిస్తూ.. పెట్రోలింగ్ పెంచి, రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేయిస్తూ కేసీఆర్ ఉన్నతంగా పరిపాలన సాగించారు. 2022లో తెలంగాణలో 937 హత్యలు చోటు చేసుకోగా.. 2023లో అతి స్వల్ప తేడాతో 954 హత్యలు నమోదయ్యాయి. కాగా, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 27,721 హత్యలు నమోదయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా రోజుకు సగటున 76 హత్యలు జరుగుతున్నాయి.