హైదరాబాద్, సిటీబ్యూరో/బంజారాహి ల్స్, జూలై 7 (నమస్తే తెలంగాణ): అందాల పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు.
విద్యార్థి సంఘం నాయకులు సీఎం ఇంటివైపు దూసుకెళ్లడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకోగా, వారిని పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థి సమస్యలపై ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేస్తే సహించేది లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అడుగుతున్నామని తెలిపారు. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. పాలిసెట్ కౌన్సెలింగ్ పూర్తయి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండటం వల్ల సీట్ల కేటాయింపులు నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.