హిమాయత్ నగర్, ఏప్రిల్ 2: హెచ్‌సీయూ భూములను అమ్మివేసి, జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయడం సరికాదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు భద్ర, పీడీఎస్‌యూ నేత విజయ్ తెలిపారు. బుధవారం హైదర్‌గూడలో వారు మీడియాతో మాట్లాడారు.
హెచ్‌సీయూ భూముల్లో వన సంపదతోపాటు అనేక జీవరాశులు జీవిస్తున్నాయని తెలిపారు. హెచ్‌సీయూలో జరుగుతున్న పరిణామాలు విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల భూములపై కన్నేసిందని ఆరోపించారు. ప్రకృతి విధ్వంసం నేపథ్యంలో ప్రజలు దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు రమేశ్, రాకేశ్ పాల్గొన్నారు.