హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆటోమోటివ్ రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని కీలక కేంద్రంగా మార్చేందుకు తమ వంతు కృషిచేస్తామని ‘ప్రాగ్మటిక్ డిజైన్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్’ (పీడీఎస్ఎల్) డైరెక్టర్ క్రాంతి పుప్పాల తెలిపారు. ఆయన యూకే నుంచి ప్రత్యేకంగా ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. హైదరాబాద్‌ను ఆటోమోటివ్ హబ్‌గా మార్చాలనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనా స్ఫూర్తితో హైదరాబాద్‌లో తమ సంస్థను ప్రారంభించామని తెలిపారు. సెప్టెంబర్‌లో నూతన కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు ఇంగ్లాండ్‌లోని వార్విక్ విశ్వవిద్యాయంలో తాము ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. ఇంటర్వ్యూలో క్రాంతి పుప్పాల చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే..
జవాబు: హైదరాబాద్‌ను ఆటోమోటివ్ హబ్‌గా మార్చాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనే నాకు స్ఫూర్తి. దేశంలో ఫుణె తర్వాత హైదరాబాద్‌ను రెండో ఆటోమోటివ్ కేంద్రంగా చేయాలన్నది మా లక్ష్యం. హైదరాబాద్‌లో ఆటోమోటివ్ రంగం బలపడితే, విద్య-పరిశ్రమ సంబంధాలు మెరుగవుతాయి. యువతకు ఆచరణాత్మక శిక్షణ, నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారు ప్రపంచ స్థాయి సాంకేతికతలతో పనిచేసే అవకాశం కలుగుతుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొబిలిటీ కారిడార్‌ను అభివృద్ధి చేసి హైదరాబాద్‌ను పుణె, చెన్నై సరసన నిలిపింది. ఈ విధానాలు ఆటోమోటివ్ రంగంలో నూతన ఆవిషరణలకు, పెట్టుబడులకు ఊతమిచ్చాయి. ఇవి పరికరాల తయారీదారులకు, సరఫరాదారులకు ఖర్చు, సమయం తగ్గించి, నగరాన్ని ఆవిషరణల కేంద్రంగా మారుస్తాయి. ఇందులో భాగంగానే మేము హైదరాబాద్‌లో అడుగుపెట్టి, అధునాతన ఆటోమొబైల్ సేవలను అందిస్తున్నాం.
స్థానిక ఇంజినీర్లు అంతర్జాతీయ సాంకేతికతలతో పనిచేసే అవకాశం పొందితే, వారు ప్రపంచ స్థాయి ఉత్పత్తుల అభివృద్ధిలో భాగమవుతారు. ఇది వారి నైపుణ్యాలను, పోటీతత్వాన్ని పెంచుతుంది. మేము శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, వర్షాప్ల ద్వారా యువత నైపుణ్యాలను పెంచుతున్నాం. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాలను మరింత విస్తరించి, యువతను గ్లోబల్ మారెట్‌కు తగ్గట్టు సిద్ధం చేస్తాం.
కేటీఆర్ దూరదృష్టి, హైదరాబాద్‌ను సేవల కేంద్రంగా మార్చాలనే ఆయన ఆలోచనలే మాకు స్ఫూర్తి. ఆయన యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చే విధానం మమ్మల్ని ఆవిషరణల వైపు నడిపిస్తున్నది. కేటీఆర్ సేవల రంగం, డాటా భద్రత, మేధో సంపత్తి రక్షణలపై లోతైన అవగాహన కలిగి ఉన్నారు. ఆయన చేతుల మీదుగా మా సెంటర్ ప్రారంభం కావడం సంతోషంగా ఉన్నది.
ఏఐ, ఐవోటీ, 5జీ వంటి సాంకేతికతలతో ఆటోమోటివ్ రంగం రూపురేఖలు మారిపోతున్నాయి. సాఫ్ట్‌వేర్‌తో నడిచే కనెక్టెడ్ వాహనాలపై దృష్టి పెరిగింది. పీడీఎస్ఎల్ ఈ ట్రెండ్‌కు అనుగుణంగా ఆవిషరణలకు మద్దతు ఇస్తున్నది. మేము ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ నిర్వహణ, పవర్ ఎలక్ట్రానిక్స్, వాహన నియంత్రణ వ్యవస్థల్లో పనిచేస్తున్నాం. స్టార్టప్‌ల నుంచి పెద్ద ఓఈఎంల వరకు మేము సేవలు అందిస్తున్నాం. యూనివర్సిటీ-ఇండస్ట్రీ సహకారం విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం, ఆవిషరణలకు అవకాశం ఇస్తున్నది. తెలంగాణలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, హ్యాకథాన్లు, పరిశ్రమ-విద్యా సంబంధాలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
నైపుణ్యం కలిగిన ఇంజినీర్ల కొరత, అధిక ఖర్చులు, డాటా భద్రత, నియంత్రణ, అనుమతుల ప్రక్రియ వంటివి సవాళ్లు. అయితే, మేము శిక్షణ, సాంకేతికతలో పెట్టుబడులతో వీటిని అధిగమిస్తున్నాం. సాంకేతికతల ఆవిషరణ, నైపుణ్య అభివృద్ధి, పరీక్ష సౌకర్యాలు, పరిశ్రమ సహకారంపై దృష్టి పెడుతున్నాం. హైదరాబాద్‌ను గ్లోబల్ ఆటోమోటివ్ హబ్‌గా మార్చే ఈ ప్రయాణంలో యువత, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే, రాష్ట్రం ఆర్థిక, సాంకేతిక వృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి గ్లోబల్ క్లయింట్లకు ఆఫ్ లైన్ సేవలను విస్తరించాలనుకుంటున్నాం. ఒక యూకే ఇంజినీర్‌కు నలుగురు ఆఫ్‌లైన్ ఇంజినీర్లను నియమించే వ్యూహంతో, స్థానిక ప్రతిభ ను ప్రపంచ స్థాయిలో ఉపయోగిస్తాం. ఆటోమోటివ్, రైల్వే, ఏరోస్పేస్, ఎనర్జీ రంగాల్లో ఇం జినీరింగ్ సొల్యూషన్స్‌పై దృష్టి పెడుతున్నాం.
పుప్పాల క్రాంతి స్వస్థలం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్. తండ్రి నర్సింగరావు ఐడీపీఎల్‌లో రిటైర్డ్ ఉద్యోగి. క్రాంతి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్, జేఎన్‌యూలో ఎంబీఏ చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ డిజైన్ స్ట్రాటజీ చదివారు. 15 ఏండ్లుగా ఇంగ్లండ్‌లోని కోవెంట్రీలో ఉంటున్నారు. ప్రాగ్మటిక్ డిజైన్ సొల్యూషన్స్‌కు ఎండీగా కొనసాగుతున్నారు.
పీడీఎస్ఎల్ ప్రధానంగా వాహన తయారీ పరిశ్రమలకు సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ సేవలు అందించే సంస్థ. ఇది 2010లో ప్రారంభమైన సంస్థ భారత్‌తోపాటు బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాంలో సేవలందిస్తోందని, 700 మంది పని చేస్తున్నారని, వార్షిక టర్నోవర్ రూ.171.12 కోట్లు అని క్రాంతి పేర్కొన్నారు. కస్టమర్లకు అందుబాటులో ఉంటూ, వాహనాల పరీక్షలను సులభం చేయడమే తమ లక్ష్యమన్నారు. మెక్లారెన్, ఆస్టన్‌మార్టిన్, జాగ్వార్ కంపెనీలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నామన్నారు. 15 ఏండ్లలో తమ నమ్మకమైన, నాణ్యమైన సేవలతో బంధాలు బలపడ్డాయన్నారు.