‘రాహుల్ గాంధీ గారు… ప్రజలు మీకు అధికారం అప్పగిస్తారని ఎలా అనుకుంటున్నారు?’
‘దేశాన్ని పాలిస్తున్న మోదీ కన్నా నేను తెలివైన వాడిని, అందుకే ప్రజలు మోదీని దించేసి నాకు అధికారం అప్పగిస్తారు.’
‘ఎలా తెలివైన వారు?’
‘మేధావులు ఏ నిర్ణయం త్వరగా తీసుకోరు. పెళ్లి చేసుకోవాలా? వద్దా ? అని నేను ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేకపోతున్నాను. కాబట్టి నేను మేధావిని.’
‘పీసీసీ అధ్యక్షుడు డబ్బుల సూట్ కేసుతో ఓటు కొనడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. టికెట్లు అమ్ముకుంటున్నారని గాంధీ భవన్ కోడై కూస్తున్నది. మీ వాళ్లే టికెట్ల అమ్మకాలపై విచారణ జరిపించాలి అని ఈడీకి ఫిర్యాదు చేశారు. మీరేమో చుట్టూ అవినీతి పరులను పెట్టుకొని అవినీతి రహిత పాలన అందిస్తామంటున్నారు.’
‘కిరాతకుడు వాల్మీకిగా మారలేదా?
మేమూ అంతే. కిరాతకులను మా పార్టీలో చేర్చుకొని మహోన్నతులుగా మారుస్తాం.’
‘అచ్చం కమలం పార్టీలానే అన్నమాట. ఈడీ, సీబీఐ దాడులు చేసి కేసులు పెడతారు. కమలంలో చేరగానే క్లీన్ చిట్ ఇస్తారు… అంతేనా.’
‘కమలం పార్టీకీ మాకూ చాలా తేడా ఉంది. ఈడీ దాడి తర్వాత వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తారు. దాడికి ముందే మేం నిష్కళంకులుగా ప్రకటిస్తాం.’
‘మీ లక్ష్యం?’
‘రాజకీయాల్లో కుటుంబ పాలన అంతం చేయడం.’
‘రాహుల్ గారు బాగా చెప్పారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఈ లక్ష్యం సాధించడంలో మీరు విజయానికి దగ్గరగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోకుండా పార్టీని 44 స్థానాలకు పరిమితం చేశారు. అంటే , ఏదో ఒక రోజు మీరు విజయం సాధిస్తారు బాబూ… సాధిస్తారు.’
‘మరొక్క ప్రశ్న… మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ వరకు వందేండ్లుగా పార్టీని ఒకే కుటుంబం నడిపించడం ప్రపంచంలోనే రికార్డ్… దీనికి మీరేమంటారు?’
‘అవును. మా కుటుంబం మొత్తం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నది. మా పోరాటం విజయవంతం కావాలని గత ఎన్నికల్లో నారా-నందమూరి కుటుంబ సహాయంతో పోరాడాం. ఈ సారి కూడా ఆ కుటుంబాల మద్దతు మాకే ఉంటుంది. ఉత్తమ్ కుటుంబం, మైనం కుటుంబం, కొండా కుటుంబం… ఇలా అన్ని కుటుంబాల మద్దతుతో మా కుటుంబం పోరాడుతుంది.’
‘ఆంధ్రా అసెంబ్లీలో మీ లక్ష్యం నెరవేరింది… తెలంగాణలో కూడా ఏదో ఒక రోజు మీ లక్ష్యం నెరవేరుతుంది.’
– మురళి