హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : త్వరలో రాష్ట్ర క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ తెలిపారు. అయితే మంత్రుల మార్పులు, చేర్పులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఈ మేర కు ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆ సక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్ విస్తరణ, కొందరు మంత్రులకు ఉద్వాసనపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ అంశంపై స్పందించిన పీసీసీ అధ్యక్షు డు.. ప్రక్షాళన నిజమనేవిధంగా వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రక్షాళన ఉంటుందని సంకేతాలిచ్చారు. ఇ క తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారంపై కూడా స్పందించారు. తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదని, తాను మంత్రివర్గంలోకి వెళ్లబోనని స్పష్టంచేశారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవే ఇష్టమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని పేర్కొన్నారు.