హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదవపెట్టి డబ్బులు తెచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ చెప్తుంటే అలాంటిదేమీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నరు. యూనివర్సిటీ భూములు కుదువ పెట్టారా? అమ్మారా? దోచుకున్నారా? అనే విషయంపై తేల్చుకునేందుకు ముందుగా కాంగ్రెస్ నాయకులంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకుని చెప్పదల్చుకున్నదేదో స్పష్టంగా చెప్పాలి.
– కేటీఆర్
KTR | కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలి భూమిని లిటిగేషన్లలో ఇరికించి డబ్బులు తెచ్చుకొనేందుకు ఓ బీజేపీ ఎంపీ, సీఎం రేవంత్‌రెడ్డి కలిసి పని చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు ఎంపీ ముంబయికి చెందిన ఓ బ్రోకరేజీ సంస్థను ముందుకు తెచ్చారని, ఆ సంస్థకు కమీషన్ రూపంలో రూ.170 కోట్ల లంచమిచ్చి సీఎం రేవంత్‌రెడ్డి రూ.10 వేల కోట్ల రుణం తెచ్చుకున్నారని చెప్పారు. ‘మేము కూడా భూములు అమ్మినం.. మాకంటే ముందు కాంగ్రెస్, అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా భూములు అమ్మినయి. పన్నేతర ఆదాయం కావాలని, రాష్ర్టానికి పంచాలని ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎండీఏ అమ్మింది.. టీజీఐఐసీ అమ్మింది.. మధ్యలో బ్రోకర్లను తెచ్చి రూ.170 కోట్ల కమీషన్ ఇచ్చి భూములు తాకట్టు పెట్టే పనులు మేం చేయలేదు’ అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి భూములు అమ్మామని, బ్రోకర్లను మధ్యలో పెట్ట లేదని వివరించారు. రూ.10 వేల కోట్ల రుణానికి రూ.170 కోట్ల కమీషన్ ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. అంటే 1.7 శాతం కమీషన్ ఇచ్చారని చెప్పారు. ‘భూమి మీదే అయితే దొంగ రాత్రి ఎం దుకు చదును చేయాలని చూసిండ్రు? అడ్డదారిలో అమ్ముకోవాలని ఎందుకు చూస్తున్నరు? దాన్ని తా కట్టు పెట్టే ఖర్మ ఎందుకు వచ్చిందో చెప్పాలి’ అని నిలదీశారు. శనివారం కరీంనగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూమిని తాకట్టు పెట్టించి బీకన్ అనే సంస్థకు అకౌంట్ ఓపెన్ చేసింది ఐసీఐసీఐ బ్యాంకులో అని చెప్పారు.
శ్రీధర్ బాబు అన్నట్టు తాము భూములు అమ్మింది ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమేనని, మధ్యన బ్రోకర్లను పెట్ట లేదని, ఎవరికీ కమీషన్లు ఇవ్వలేదని స్పష్టంచేశారు. బీజేపీ ఎంపీ ఎవరనేది ముందు ముందు చెప్తానని, ప్యూచర్ సిటీలోనో ఎక్కడో ఒక దగ్గర ఆ ఎంపీకి సీఎం రేవంత్‌రెడ్డి నుంచి సహాయం అందుతుందని, అది పూర్తయిన తర్వాత తాను బయట పెడతానని తెలిపారు. సీఎం, బీజేపీ ఎంపీ పాత దందాలను ఆధారాలతో సహా బయట పెడతానని చెప్పారు. ఆర్బీఐ నిబంధన ప్రకారమే ఇదంతా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు సమర్థ్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాము ఆర్బీఐ విచారణనే కోరుకుంటున్నామని స్పష్టంచేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చామని, రైతు భరోసాకు ఇచ్చామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడే అంగీకరించారని, బీకన్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు తనఖా పెట్టినట్టు ఒక డాక్యుమెంట్‌ను కూడా తాను బయట పెట్టానని కేటీఆర్ చెప్పారు. ఇవన్నీ అవాస్తవాలని కాంగ్రెస్ నాయకుల వద్ద ఏవైనా ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. ఈ పని చేసినందుకు సుప్రీం కోర్టు కూడా జైల్లో పెడతామని హెచ్చరించిందని, ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకోవాలని, హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటాన్ని గౌరవించి కాంగ్రెస్ నాయకులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు.
కాదని ఆ భూములను అమ్మే ప్రయత్నం చేస్తే, ఎవరైనా ఇంచు భూమి కొనుగోలు చేసినా తాము ఊరుకోబోమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్కును ఏర్పాటు చేస్తామని, గ్రీన్ జోన్‌గానే ఉంచుతాం తప్ప ఇంచు భూమిని కూడా పోకుండా చూస్తామని స్పష్టంచేశారు. ఈ భూముల్లో ఇంచు భూములు కొన్న బిల్డర్లు, రేవంత్‌రెడ్డి తొత్తులు ఎవరైనా ఉంటే ఆలోచించుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలనలో ఏది ఒరిజనలో.. ఏది ఫేకో ఎవరికీ తెలియడం లేదని, ఆయనే పెద్ద ఫేక్ అని ఎద్దేవా చేశారు.
ఎందుకంటే అప్పుడే మోదీ ఫేక్ అంటాడని, అపుడే కాదంటాడని, రాష్ర్టానికి అప్పు పుట్టడం లేదంటాడని, అసెంబ్లీకి వచ్చి అప్పు చేసిన అంటాడని, బయట అది ప్రభుత్వ భూమి కాదంటాడని, లోపల ఇంకోటి చెప్తాడని, బయట అక్కడ జింకలు లేవంటాడని, లోపల అక్కడ గుంట నక్కలు ఉన్నాయంటాడని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌లో ఒక అపరిచితుడు ఉంటాడని, రాము కరెక్టో, రెమో కరెక్టో ఎవరికీ తెలియదని దెప్పిపొడిచారు. రేవంత్‌రెడ్డి చెప్తున్నది కరెక్టో, తాను చెప్తున్నది కరెక్టో పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా ప్రజలకు తెలుపాలని జర్నలిస్టులను కోరారు.
రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో మంత్రి శ్రీధర్ బాబుకు తెలుస్తున్నదా అని, మూసీ నది ప్రక్షాళన పనుల్లో రూ.1.50 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతున్నదని శ్రీధర్‌బాబుకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు, రైతు భరోసాకు, రుణమాఫీకి నిధులు లేవని చెప్తున్న ప్రభుత్వానికి మూసీ పునరుద్ధరణకు మాత్రం రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. హైదరాబాద్ పరిధిలో మూసీని వంద శాతం పునరుద్ధరించింది తామేనని, కొత్తగా ఈ ప్రభుత్వం చేసేదేమీ లేదని చెప్పారు. గోదావరి నీళ్లు తెచ్చి గండిపేటలో పోయించేందుకు కావాల్సింది రూ.1,100 కోట్లు మాత్రమేనని, దానికి రూ.1.50 లక్షల కోట్లు కావాలంటూ సీఎం కుంభకోణం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు.
ఈ డబ్బునంతా ఢిల్లీకి మూటలు కట్టి పంపుతానంటే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ రకమైన అవినీతికి పాల్పడుతున్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది తామేనని, బీజేపీ ఎక్కుడున్నదని ప్రశ్నించారు. అమృత్ స్కీంలో స్కాం జరిగిందని తాము చెప్తుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రికి ఆధారాలతో సహా అందిస్తే సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ రక్షణ గోడలా నిలిచారని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే హెచ్‌సీయూ విషయంలో కేంద్రం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆర్బీఐని, సీబీఐని రంగంలోకి దించాలని కోరారు. సుంకిశాల, ఎస్ఎల్బీసీపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని, గతంలో బీఆర్ఎస్ పాలనలో చిన్న సంఘటన జరిగినా విచారణకు ఆదేశాలిచ్చేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకునేవారని, కాళ్లల్ల కట్టె పెట్టేవారని, ఇప్పుడు 16 నెలలుగా గవర్నర్ పత్తా లేడెందుకని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు రేవంత్‌రెడ్డి చేయడని, బండి సంజయ్ అడగడని మండిపడ్డారు.
చీకట్లో కూర్చొని చేతులు కలిపి, చేసుకోవాల్సిన పనులు చేసుకుంటున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అని విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ గొంతు ఇప్పుడెందుకు మూగబోయిందని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మీద ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు. ‘అందుకే మేము రెండు ఢిల్లీ పార్టీల్లో ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకొటికి చెప్పులు మోసే పార్టీ అని అంటున్నం.. ఈ పార్టీలు ఎన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేవు. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష.. అది చెప్పేందుకే ఏప్రిల్ 27న బహిరంగ సభ’ అని స్పష్టంచేశారు.
ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పేరుతో ఏర్పడి ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన పార్టీ 25వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఈ ఏడాది బీఆర్ఎస్కు చాలా కీలకమైన సంవత్సరం కాబోతున్నదని తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడిన ఈ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారవచ్చుగానీ, జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు కూడా మారలేదు’ అని చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీగా, మన పార్టీగా బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిందని తెలిపారు.
ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్టుగానే 25 ఏండ్లు నిండుతున్న సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తిలో రజతోత్సవ వేడుకలు నిర్వహించుకోబోతున్నామని వివరించారు. సభకు వచ్చేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి ఊరి నుంచి, కార్యకర్తల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉన్నదని, దాదాపు 60 లక్షల సభ్య త్వం ఉన్న పార్టీ తమదని, ప్రజల నుంచి వస్తున్న స్పం దన చూస్తుంటే లక్షలాది మందితో సభ నిర్వహిస్తామనే విశ్వాసం తనకు కలుగుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మరో 25 ఏండ్లు చెక్కు చెదరకుండా ఉం డే విధంగా సుశిక్షితులైన కార్యకర్తలను, సైనికులను తయారు చేసుకుని ముందుకు పోతామని చెప్పారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని ఒక్కతాటిపైకి తేవడం, ఉద్యమ సమయంలో వివిధ సందర్భాల్లో జరిగిన కార్యకలాపాలను ప్రజలు గుర్తుచేసుకునేలా కొన్ని కార్యక్రమాలను తీసుకుంటున్నామని వివరించారు. మేలో పార్టీ సభ్యత్వ నమోదును తిరిగి ప్రారంభిస్తున్నామని, ఈ సారి డిజిటల్ సభ్యత్వ నమోదు చేయబోతున్నామని స్పష్టంచేశారు. ఆ తర్వాత దసరాలోగా గ్రామ, పట్టణ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.
ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక నిర్వహించబోతున్నామని చెప్పారు. అన్ని జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయాల నుంచే ఇక ముందు కార్యకలాపాలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి సుశిక్షితులైన 500 మందిని ఎంపిక చేసి పూర్తి స్థాయి శిక్షణ ఇస్తామని, పదకొండేళ్లుగా బీజేపీ చేస్తున్న అరాచకాలు, 16 నెలలుగా కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గ పాలనను ఎండగట్టేలా ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, రాష్ర్టాన్ని సాధించిన అంశం, చేసిన పోరాటాలు, త్యాగాలపైనా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
పదేండ్లలో బీఆర్ఎస్ ఎలాంటి పాలన అందించింది, మన భాష, సంస్కృతిపై గతంలో ఎలాంటి దాడులు జరిగాయనే విషయం, తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు విషయాలపైనా శిక్షణ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పార్టీ జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎల్ఎండీ, మిడ్‌మానేరులో ఏడు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, తంగళ్లపల్లి వంతెన మీదుగా చూస్తే మిడ్ మానేరు ఎడారిలా కనిపిస్తున్నదని కేటీఆర్ వాపోయారు. ఒకప్పుడు ఇదే ఏప్రిల్, మే నెలల్లో కేసీఆర్ ప్రభుత్వంలో చెరువులు మత్తళ్లు దుంకిన విషయాన్ని గుర్తుచేశారు. కేవలం కేసీఆర్‌పై కోపంతో గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డ కొట్టుకుపోయిందని ఎన్నికల్లో చిల్లర ప్రచారం చేశారని మండిపడ్డారు.
‘ఆయన దున్నపోతు ఈనింది అంటే ఈయన దుడ్డెను కట్టేయమన్నట్టు ఎన్డీఎస్ఏ అని ఢిల్లీ నుంచి నీళ్లల్ల దిగకుండా, కనీసం కిందికి వెళ్లి చూడకుండా ఏదో అయిపోయిందన్నట్టు 48 గంటల్లో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.. మేడిగడ్డ మీద 48 గంటల్లోనే రిపోర్టు ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ, సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోతే ఎందుకు మాట్లాడడం లేదు? ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి పోయి 8 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నది’ అని మండిపడ్డారు.
‘ఎన్డీఎస్ఏ రాదు.. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులపై మాట్లాడరు.. దీన్ని బట్టి కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ అది ఎప్పటికీ నెరవేరదు’ అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 520 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ పరిస్థితి ఇంకా దుర్భరం కావద్దంటే ప్రభుత్వం దున్న పోతు నిద్ర నుంచి మేల్కోవాలని, ఎల్ఎండీ, మిడ్ మానేరు, అప్పర్ మానేరులను గోదావరి నీళ్లతో నింపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు మూడు నెలల్లో మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన పిల్లర్‌కు మరమ్మతులు చేసి వెంటనే నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
ఇటు ప్రజా పోరాటాలను కొనసాగిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదవపెట్టి డబ్బులు తెచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ చెప్తుంటే అలాంటిదేమీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నారని చెప్పారు. కంచ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో దేశంలోనే అతి పెద్ద ఫ్రాడ్ జరిగిందని విమర్శించారు.
ఉన్న సంపదకంటే ఎక్కువ మొత్తాన్ని చూపించి బ్యాంకులను, ఫైనాన్స్ సంస్థలను మోసం చేయడం ఫ్రాడ్ కాదా? అని ప్రశ్నించారు. ఈ భూములను కుదువ పెడుతున్నామని కాంగ్రెస్ నాయకులే అసెంబ్లీలో చెప్పారని, పీసీసీ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అవినీతిని ఎప్పటికపుడు బయటకులాగి ప్రజల ముందు పెడతామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకోవాలె. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటాన్ని గౌరవించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలె. కాదని ఆ భూములను అమ్మే ప్రయత్నం చేసినా.. ఎవరైనా ఇంచు భూమిని కొనుగోలు చేసినా మేము ఊరుకోబోం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొనుగోళ్లను రద్దు చేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్కు ఏర్పాటు చేసి గ్రీన్ జోన్‌గానే ఉంచుతం. ఇక్కడ భూములను కొన్న బిల్డర్లు, రేవంత్‌రెడ్డి తొత్తులు ఎవరైనా ఉంటే ఆలోచించుకోవాలె.
-కేటీఆర్
లక్షలాది మందితో శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సభ నిర్వహించుకోబోతున్నామన్నామని, 1,250 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆర్టీసీకి ఇప్పటికే రూ.10 కోట్లు చెల్లించామని, 3 వేల బస్సులు కావాలని అడిగితే సూత్ర ప్రాయంగా అంగీకరించారని, ఇంకా ప్రైవేట్ బస్సుల్లో కూడా జనం తరలి వచ్చేందుకు సిద్ధపడుతున్నారని వివరించారు. సభా ప్రాంగణం వద్ద 10 లక్షల చొప్పున వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, వైద్య శిబిరాలు, మూత్ర శాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైద్యుల బృందాలు, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా తక్షణమే స్వచ్ఛందంగా సేవలందించేందుకు 2 వేల మంది కార్యకర్తలను వలంటీర్లుగా నియమించామని తెలిపారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1,050 కోట్లతో ఆరు ైప్లె ఓవర్లకు టెండర్లు పూర్తి చేశామని, ప్రజలు చెట్లు కొట్టవద్దని కోరిన మేరకు కేసీఆర్ ఆదేశాలతో ఆ పనులను ఆపేశామని, ఇది తమ ప్రజాస్వామిక స్ఫూర్తి అని కేటీఆర్ గుర్తుచేశారు. 400 ఎకరాల్లో చెట్లు కొడుతున్నారని, జింకలు చనిపోతున్నాయని, జంతువులన్నీ మాయమవుతున్నాయని, భూములను అమ్మవద్దని వర్సిటీ విద్యార్థులు ఆందోళన మొదలు పెట్టారని, అక్కడ చదువుతున్నవారంతా 70-80 శాతం ఇతర రాష్ర్టాల వారని, వాళ్లకు ఉన్న సోయి మనకు లేకుంటే ఎలాగని ప్రశ్నించారు.