హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : వానకాలం ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఈ సీజన్లో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఇందులో 40 లక్షల టన్నులు సన్నాలు, 40 లక్షల టన్నుల దొడ్డు దాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురైతే 1800-425-00333/1967 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
గత యాసంగి సన్నధాన్యం బోనస్ బకాయిలు రూ.1,160 కోట్లను ప్రభుత్వం రైతులకు చెల్లించలేదు. ఐదు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. వానకాలం పంటలు కోతకొచ్చి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా గత బోనస్ ఇవ్వకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు తొలి ప్రాధన్యత ఇస్తున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో బేగంపేటలోని ఓ హోటల్లో జరిగిన ప్రపంచ ప్రమాణాల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు బాధ్యతగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, బీఐఎస్ ధ్రువీకరించిన వస్తువులు మాత్రమే కొనాలని కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): మార్ఫెడ్ ద్వారా గురువారం నుంచి మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటల కొనుగోళ్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మారెటింగ్, మార్ఫెడ్, హకా సంస్థల ఎండీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పంటల కొనుగోళ్లకు అవసరమైన క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.