TG Assembly | కుల గణన సర్వేలో 98లక్షల జనాభా తగ్గించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో సర్వే నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు మాత్రమే బీసీల నినాదం ఎత్తుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తున్నారన్నారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా ప్రకారం బీసీలకు సగం సీట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు చెబుతున్నాయన్నారు. గెలుపు అవకాశాలు లేని స్థానాలను బీసీలకు కేటాయిస్తున్నారని.. ఎంబీసీలకు రూ.3వేలకోట్లు కేటాయించి.. కేవలం రూ.15కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కుల సంఘాల భవనాలకు స్థలం కేటాయింపులోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని.. బీసీ భవనాలకు స్థలాలను హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో కేటాయించారన్నారు.
అగ్రవర్ణాల వారి కులభవనాలకు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కేటాయించారని.. బలహీనవర్గాల వారి విషయంలో కేవలం తీర్మానాలు చేసి వదిలేస్తున్నారన్నారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం.. జనాభా సంఖ్యకు పొంతన లేదన్నారు. ప్రభుత్వ వెబ్సైట ప్రకారం.. రాష్ట్ర జనాభా 4.33కోట్లు అని తెలుస్తుందని.. సర్వే ప్రకారం మాత్రం రాష్ట్ర జనాభా 3.76కోట్లు అని చెప్తున్నారన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఈ సర్వేలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే కొత్త పదాలను సృష్టించారని.. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందన్నారు. హైకోర్టు అయినా.. ముస్లిం బీసీ అనే పదం వాడారని ఒకసారి మామూలు వ్యక్తి పిటిషన్ వేస్తే వారం రోజుల్లో కొట్టివేస్తుందని.. కోర్టుల్లో కేసులు వేసి బీసీ రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
కోర్టుల పేరు చెప్పి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పెంపును పక్కనపెడుతుందన్నారు. తెలిసి చేస్తున్నరా? అధికారుల తప్పిదమా? అని విమర్శించారు. ఎలాగైనా కొట్టివేసేదే కదా? ఒకరోజులో అసెంబ్లీలోనే కదా.. ఏదో నాలుగు కాగితాలు పెట్టియేండి కిరికిపోతది.. రేపోమాపో ఎన్నికలకు పోవాలని చూస్తున్నారా? మాకు అర్థం అవుతలేదన్నారు. రాజకీయంగా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. మా పరిధి కాదు.. కేంద్ర ప్రభుత్వమని చెప్పి రాజకీయంగా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. తీర్మానం చేసి.. ఢిల్లీకి పంపించకుండా చట్టబద్దత చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎంత ఆపారమైన అనుభవం అంటే.. భారతదేశంలో ఏయే కోర్టులు ఏయే కోర్టులు కొట్టివేశాయో.. ఏం లొసుగులు ఉన్నయో వాటిపై అవగాహన ఉన్నది. 42శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నప్పుడు.. ఉన్న ఇబ్బందులు తెలుసునన్నారు. ఈ 14 నెలల్లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేయలేదని.. స్థానిక సంస్థల గడువు ముగిసింది.. రేపో మాపో ఎన్నికలు జరుగుతాయని.. హడావుడి పడి తప్పుడు తడకలతో కూడిన నివేదిక తయారు చేస్తే కోర్టులు కొట్టివేస్తాయన్నారు. ముఖ్యమంత్రి ఓ మాట చెప్పారు.. ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ అంటేశామని చెప్పారు.
మా ఇంటికి రెండు స్టికర్స్ వేశారు. ఒక ఇంటికి రెండు స్టికర్స్ వేస్తారంటే.. ఏమో సర్ అన్నారని.. బీసీ జనాభాను ఎక్కువ చూపిస్తారని తాను అనుకున్నానని.. ప్రభుత్వం పెట్టిన ఈ నివేదిక చూస్తే మా సంఖ్య తగ్గిపోయిందన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకొని స్టిక్కర్స్ రెండు వేస్తే.. అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మళ్లీ పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రెండు స్టికర్స్ వేసిన అధికారులపైనే చర్యలు తీసుకుంటామన్నారని.. వాళ్ల పేర్లు చెబితే మంచిదని అంటున్నారని.. కానీ, 98లక్షల జనాభా తగ్గించిన వారి వివరాలు చెప్పడం లేదన్నారు. మధ్యలో మరోసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సర్వే చేపట్టామన్నారు. కులగణన సర్వేను పటిష్టంగా నిర్వహించామన్నారు. దీనికి పాయల్ శంకర్ బదులిస్తూ తాను ప్రభుత్వ వెబ్సైట్ డేటా, ప్రభుత్వం ఇచ్చిన నివేదికను మాత్రమే పరిగణలోకి తీసుకొని చెబుతున్నానన్నారు.