హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు రోడ్డెక్కాయి. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీడీపీఎంఏ) ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌లో శాంతిదీక్షను నిర్వహించాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తరలివచ్చిన 900 కాలేజీల యాజమాన్యాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ తాము సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సహా అందరిని కలిశామని, అయినా బకాయిలు విడుదలకాలేదని యాజమాన్యాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు.
పలు కాలేజీలు మూసివేత అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రభుత్వం బకాయిలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బీ సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కల్దేవి పరమేశ్వర్, శ్రీధర్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కాలేజీలను వేరుచేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కాలేజీలను వేరుచేయాలి.ఏటా ప్రభుత్వం ఈ పథకానికి రూ.2,500 కోట్లు కేటాయిస్తున్నది. దీంట్లో 40% నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు, మిగతా 60% ప్రొఫెషనల్ కాలేజీలకే వెళ్తున్నది. ప్రొఫెషనల్ కాలేజీలతో మమ్మల్ని జత చేయడంతో మాకు అన్యాయం జరుగుతున్నది.
– ఎక్కల్దేవి పరమేశ్వర్, టీడీడీపీఎంఏ వర్కింగ్ ప్రెసిడెంట్
ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీ భవనాల అద్దెలు, సిబ్బంది జీతాలు చెల్లించలేక కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో కాలేజీ కోటి రూపాయల నుంచి నాలుగు కోట్ల వరకు అప్పులు తీసుకున్నాయి. కొన్ని కాలేజీలు మూతపడగా, మరికొన్ని కాలేజీలు మూసివేత అంచుల్లో ఉన్నాయి. రెండు నెలల్లో అప్పుల బాధతో నలుగురు కాలేజీ నిర్వాహకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం.
– సూర్యనారాయణరెడ్డి, టీడీడీపీఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు