హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో ఎలా తిరుగుతావ్ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తెలంగాణ మీ అయ్య జాగీరా? దాడులు చేస్తారా? రండి నా ఇంటి అడ్రస్ ఇదే! ఇప్పుడు డిసైడ్ అయ్యా.. తెలంగాణ అంతటా నేనే తిరుగుతా. ఇకడ బాంచెన్ అనేవాళ్లు, భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు. మీరెవరు అడ్డుకోవడానికి?’ అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సవాల్ విసిరారు. ‘రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడులో పోటీ చేయవచ్చు, ఇందిరాగాంధీ మెదక్‌లో పోటీ చేయవచ్చు, కానీ మేము వస్తే అడ్డుకుంటారా? కాంగ్రెస్‌కు ఒక పద్ధతి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? సోకాల్డ్ నేషనల్ పార్టీ ఇలాగేనా మాట్లాడేది? ఏంటి మీ హిపోక్రసీ? దేశంలో ఇంకో చోటికి వెళ్లాలంటే వీసా తీసుకొని వెళ్లాలా..?’ అంటూ ఊగిపోయారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీ సభ, తనపై కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడుతవ్. మేం తిరుగనివ్వం, తిరిగితే నాలుకలు కోస్తాం అని అంటున్నారు.
తెలంగాణ మీ అయ్య జాగీరా? నాకు తెలంగాణలో కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ. ఇక్కడయితే రానివ్వమనే అంటున్నారు. కోనసీమలో తలతీసేస్తామంటారు. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను. బెదిరించేవాళ్లకు ఒకటే చెప్తున్నా. ఇదే నా అడ్రస్. బాంచెన్ సారు కాల్మొక్తా అనేవాళ్లమైతే పార్టీ పెడతామా? తెలంగాణకు చెందిన ఏ ఒక్క నాయకుడినీ నేను ఏమీ అనలేదు. నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు. నా గుండెల్లో తెలంగాణ ఉన్నది. ఎన్ని తిట్టినా పట్టించుకోను. వైసీపీ గూండాలు చంపేస్తామని బెదిరించినట్టు తెలంగాణవాళ్లు బెదిరించలేదు’ అని పవన్ వివరించారు. తాను చెరువులను కబ్జాచేశాపని చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. నిజంగానే తాను చెరువులను కబ్జా చేసినట్టు నిరూపిస్తే దానిని ప్రభుత్వానికి రాసిస్తానని, తెలంగాణ ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని సవాల్ విసిరారు.
ప్రాంతీయ వాదమే.. కాంగ్రెస్ వాదమా? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. ‘తెలంగాణలో ఆంధ్రావాళ్లకు పనేంటి అని మాట్లాడుతున్నారు? మరి తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎందుకున్నారు? ఎవరిని బేవకూఫ్‌లను చేస్తున్నారు? పవనకల్యాణ్ తెలంగాణకు రాకూడదని అసెంబ్లీలో తీర్మానం పెడతామంటున్నారు. పెట్టండి. ఇప్పుడు డిసైడ్ అయ్యా. తెలంగాణలో జనసేన ఉంటుంది. అవసరమైతే నేనే తిరుగుతా. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఇక్కడికి రాకూడదంటే చాలాకాలంగా భరించాం. కాంగ్రెస్ నాయకులకు ఒక్కటే చెప్తున్నా. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కేరళలో పోటీ చేయొచ్చు! ఇందిరాగాంధీ మెదక్‌లో పోటీ చేయొచ్చు!?
పీవీ నర్సింహారావును నంద్యాల నుంచి గెలిపించారు. మేము వస్తే అడ్డుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? జాతీయ పార్టీ ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతుందా? సోకాల్డ్ జాతీయ కాంగ్రెస్‌కు పద్ధతి ఉందా? దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకొని వెళ్లాలా? ఇది భారతదేశం అనుకున్నారా? పాకిస్థాన్, పాలస్తీనా అనుకున్నారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాము రెండువేల మందితో సభ పెట్టుకుంటామంటే అనుమతివ్వకపోతే ఎలా అని నిలదీశారు. జర్నలిస్టు పాశం యాదగిరి అంటే ఎంతో గౌరవముందని, ఆయన కూడా తనను తిడుతున్నారని పేర్కొన్నారు. జనసేన కచ్చితంగా ఇక్కడ నిలబడి తీరుతుందని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. ఏపీలోనూ గద్దర్ విగ్రహం పెడుతామని చెప్పా రు. తెలంగాణలో ప్రతి సమస్యపైనా పోరాడుతామని తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నదని ప్రతిసారీ కొందరు ప్రశ్నిస్తున్నారని, తమ పార్టీని హైదరాబాద్ గడ్డపైనే పెట్టామని పవన్‌కల్యాణ్ గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆలోచన రాకముందు నుంచే తెలంగాణపై ప్రేమ ఉన్నదని, ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమను విమర్శిస్తున్న గొంతులేవీ 2009లో లేవని, తెలంగాణ నలుమూలలా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ తిరిగామని, ఆదిలాబాద్ గోండు బిడ్డలకు బోర్లు వేయించామని గుర్తుచేశారు. తెలంగాణపై తనకున్న ప్రేమను ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
తెలంగాణ విభజనకు తాము వ్యతిరేకం కాదని, విభజించిన తీరునే వ్యతిరేకించామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం తనను ఏపీలో అడుగుపెట్టనివ్వబోనని ప్రకటిస్తే, తనవెంట తెలంగాణ నిలిచిందని తెలిపారు. తాను ఏపీలోనే అధికారం కోరుకోలేదని, తెలంగాణలోనూ మార్పు తప్ప మరేమీ కోరుకోవడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్రాపై విద్వేషం చూపలేదని, అలా చేస్తే ఒక్క ఆంధ్రా వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవాడు కాదని అన్నారు.
వామపక్షాలు సైతం ప్రాంతీయత గురించి మాట్లాడుతున్నాయని పవన్‌కల్యాణ్ విమర్శించారు. అలాంటి వారివల్లనే కమ్యూనిజం చచ్చిపోతున్నదని వ్యాఖ్యానించారు. గద్దర్ గురించి మాట్లాడుతారని, ఆయన బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘గద్దరన్న నా ఇంటికొచ్చాడు. అరేయ్ తమ్మి వెన్నులో నాకు బుల్లెట్లు దిగాయి. నడువలేకపోతున్నా.. కారులో, ఆటోలో తిరగలేకపోతున్న. ఒక అన్నగా, హక్కుగా అడుగుతున్న ఒక బండి కొనివ్వు అంటే మూడు నాలుగురోజుల్లో కొనిచ్చా.
గద్దరన్న బతికున్నప్పుడు ఆయనకు మీరేం చేశారు?’ అని ప్రశ్నించారు. తెలంగాణ మీద కమిట్మెంట్ ఉంది కాబట్టే కొండగట్టు ఆలయానికి టీటీడీ నుంచి రూ.30 కోట్లు ఇప్పించామని, విపత్తుల సమయంలో ప్రభుత్వానికి రూ.కోటి ఇచ్చానని తెలిపారు. అమిత్‌షాతో తాను ఏదో మాట్లాడానని చెప్తూ, కొందరు విశ్లేషకులు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలా తమపై మాట్లాడారని, చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారని, దానినే తాము ఖండించామని పవన్‌కల్యాణ్ వివరించారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
ప్రెస్‌మీట్ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ప్రాంతీయ విద్వేషాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ వచ్చి 12 ఏండ్లు గడిచినా ఇంకా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతారా? ఉపాధి లేకపోయినా, పరిశ్రమలు లేకపోయినా ఇంకా అందుకు ఆంధ్రోడే కారణమా? పవన్‌కల్యాణే కారణమా? ఎంతకాలం’ అని ప్రశ్నించారు. ఈ లెక్కన మీరెప్పుడు బాగుపడుతారు అనబోయి, వెంటనే ఆ వ్యాఖ్యలను అక్కడితోనే ఆపివేశారు.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ‘నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన’ చందంగా ఓ వైపు తెలంగాణపై కుట్రలు చేస్తూనే మరో వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నీతి వ్యాఖ్యలు వల్లించారు. ఈ మేరకు రాష్ర్టాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే అంటూ మంగళవారం ఒక ప్రకటనలో పాతపాటే పాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలని సూచించారు. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలని ఆకాంక్షించారు. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలని, అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలని కోరారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంతో రెండు తెలుగు రాష్ర్టాలు కీలక భూమిక పోషించాలని పేర్కొన్నారు.