‘కత్తి ఆంధ్రోళ్లదే, పొడిచేటోడు మాత్రం మనోడే ఉంటడు. అందరం అప్రమత్తంగా ఉండాలె. పదవుల కోసం పెదవులు మూసుకొనే ఇక్కడి నాయకులే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అడ్డంపడే వాళ్లకు సద్దులు మోస్తున్నరు’
– తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ నేత కేసీఆర్ విశ్లేషణ ఇది.
తెలంగాణ రాష్ట్రం ఆరు దశాబ్దాలపాటు ఒక కలగా ఎందుకు మిగిలిపోయిందో? ఎవరు అడ్డంకిగా ఉన్నారో? వివరించేందుకు ఉద్యమ నేత కేసీఆర్ ఎన్నో వేదికలపై, అనేకసార్లు ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొనేందుకు సమైక్య పాలకులు పన్నిన కుట్రల్లో ప్రతిసారీ తెలంగాణలోని కొందరు నాయకులు సహకరించేవారు. తెలంగాణ రాష్ట్ర సాకారంతో ఆంధ్రా నాయకుల పెత్తనానికి అడ్డుకట్ట పడిందని ప్రజలు సంతోషించారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చేసిన ఓటుకు నోటు కుట్రలను ఛేదించి, కుట్రదారులను పొలిమేర దాకా తరిమికొట్టినప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మళ్లా మొదటికొచ్చింది. తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే జీర్ణించుకోలేని నేతలు, పసిగుడ్డు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించిన అధినేతలు ఇప్పుడు మళ్లీ తెలంగాణలో అడుగు పెడుతున్నారు. మళ్లీ దోపిడీకి తెగబడుతున్నారు. పైగా అవాకులు, చవాకులు పేలుతున్నారు.
హనుమకొండ, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆంధ్రా సమైక్య పాలకులు, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదించి, అలుపెరుగని ఉద్యమంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోనూ సమైక్యవాద పార్టీలు ఒక్కటై తెలంగాణపై సాగించిన కుట్రలను కేసీఆర్ గట్టిగా ఎదుర్కొన్నారు. సమైక్య పార్టీల పీడను, తెలంగాణ వ్యతిరేక నాయకుల నీడను ఇక్కడి నుంచి తరిమేశారు. అప్రమత్తతతో పదేండ్లపాటు తెలంగాణపై వ్యతిరేక శక్తుల కన్నుపడకుండా కేసీఆర్ కాపుకాశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మన రాష్ట్రంలోకి చొరబడేందుకు తీవ్రమైన కుట్రలు చేసిన ఆంధ్రా పార్టీలను ప్రజల మద్దతుతో గట్టిగా అడ్డుకొన్నారు. అ తర్వాత ఐదేండ్లు తెలంగాణ వైపు చూసేందుకు భయపడిన వ్యతిరేక పార్టీలు, సమైక్యవాద నేతలు ఇప్పుడు మళ్లీ కుట్రలను తీవ్రం చేశారు.
2023లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత తెలంగాణ వ్యతిరేక పార్టీల పాత, రోత రాజకీయం మళ్లీ మొదలైంది. రెండున్నరేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఒక్కొక్కటిగా కలిసి కుట్రలను అమలు చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ హైదరాబాద్ వేదికగా మరోసారి రాజకీయ కుట్రలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన చేసినందుకు 11 రోజులు అన్నం మానేసి బాధపడ్డానని చెప్పిన పవన్.. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూ కల్లబొల్లి కబర్లు చెప్పారు. ఇవి తెలంగాణ వ్యతిరేక పార్టీల కుట్రల తొలి అడుగుగా తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతోనే తెలంగాణ వ్యతిరేక శక్తులకు మార్గం సలభమవుతున్నదని వాపోతున్నారు. ఆ శక్తులను అడ్డుకొనేందుకు ఉద్యమ నేతగా, తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ అమలుచేసిన వ్యూహాలను గుర్తు చేసుకుంటున్నారు.
తెలుగుజాతి పదాన్ని సృష్టించి తెలంగాణను కబలించిన ఆంధ్రా శక్తులను పారదోలేందుకు 60ఏండ్లు పట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సకల జనుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కల నెరవేరిన ఉత్సాహంతో ప్రజలు కేసీఆర్‌కే కొత్త రాష్ట్రం పాలనా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఏర్పాటును శాయశక్తులా అడ్డుకున్న ఆంధ్ర శక్తుల కుట్రలు ఆగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని సమైక్యవాద టీడీపీ కుట్రలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను వెంటనే కలుపుకొన్నారు.
ఆ తర్వాత కూడా తెలంగాణ వ్యతిరేక చర్యలు ఆగలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన అంశాల పరిష్కారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఉద్యోగుల విభజన.. అన్నింటిలోనూ అడ్డంకులే. పదేండ్లపాటు పాలనా కేంద్రం హైదరాబాద్ అనే సాకుతో తెలంగాణపై పెత్తనం కొనసాగించే ప్రయత్నం చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను చక్కబెట్టేందుకు ఉద్యమ సమయంలోనే ఎన్నో ఆలోచనలను చేసుకున్న కేసీఆర్‌కు వ్యతిరేక శక్తుల కుట్రలు అడ్డంకిగా మారాయి. ముందుగా తెలంగాణ వ్యతిరేక శక్తులను ఇక్కడి నుంచి తరిమికొట్టాలని నిర్ణయించుకొన్నారు.
అదే సమయంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు మరింత రెచ్చిపోయాయి. తెలంగాణ ప్రజల ఆమోదంతో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి అధికార పార్టీ ఆధ్వర్యంలో కుట్ర జరిగింది. ఉద్యమ నేత కేసీఆర్ చెప్పినట్టుగా కుట్ర ప్రణాళిక అక్కడి వారిదే అయినా కీలకపాత్ర ఇక్కడి వారే పోషించారు. 2015లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి.. ఏ మాత్రం బలం లేని టీడీపీ అభ్యర్థిని గెలిపించి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని రాజకీయ కుట్ర చేయగా, కేసీఆర్ గట్టిగా తిప్పికొట్టారు. అదే ఓటుకు నోటు కేసు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడు. రెడ్‌హ్యాండెడ్‌గా కుట్రదారులు పట్టబడటం, ఆ తర్వాత చట్టబద్ధంగా జరిగిన కేసు విచారణతో తెలంగాణ వ్యతిరేక శక్తుల వ్యూహాలకు దాదాపు ముగింపు పలికింది. ఈ పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణ అంతా హైదరాబాద్ నుంచి ముందుగానే తరలిపోవాల్సి వచ్చింది. తెలంగాణలోని ప్రతి రంగంలో పేరుకుపోయిన సమైక్యవాదుల ఆధిపత్యానికి తెరపడింది. అధికార వర్గాల్లో వ్యతిరేక శక్తులు సొంత రాష్ర్టానికి తరలిపోయే ప్రక్రియ పూర్తయింది.
సుసంపన్నమై, బీఆర్ఎస్ పాలనలో అగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రంపై సమైక్య పార్టీల కన్ను పదేపదే పడుతూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో కుట్రలు విఫలం కావడంతో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయి. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ 2018లో ఏకంగా ఆ పార్టీతోనే జట్టుకట్టింది. అయినా ప్రజల అండతో కేసీఆర్ మరోసారి తెలంగాణకు రక్షణగా నిలిచారు. భారీ ఆధిక్యతతో మరోసారి అధికారం చేపట్టారు. సొంత రాష్ట్రంలో పాలనను పక్కనబెట్టి తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నించిన సమైక్య పార్టీలను ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజలు ఓడించారు. దీంతో తెలంగాణలోకి వచ్చేందుకు వ్యతిరేక శక్తులు సాహసించలేదు. మొత్తంగా పదేండ్లపాటు వ్యతిరేక శక్తుల కన్నుపడకుండా కేసీఆర్ తెలంగాణను కాపాడటమే కాకుండా, రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ ఎన్నికల ముందే తెలంగాణ వ్యతిరేక పార్టీల ప్రభావం మొదలైంది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపిణీలోనూ వారు కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీకి చెందిన నేతలంతా కాంగ్రెస్‌లోకి వలస పోవడంతో తెలంగాణ వ్యతిరేక శక్తులు ప్రత్యక్షంగా ఇక్కడ క్రియాశీలమవుతూ వస్తున్నాయి. సినిమా, సాంస్కృతిక, సాహిత్య, ప్రైవేట్ కార్యక్రమాల పేరుతో చాపకింద నీరులా వ్యతిరేక శక్తులు విస్తరించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రభావం లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పెరుగుతూ వచ్చింది. పరస్పరం బద్ధ వ్యతిరేక పార్టీలుగా ఉన్న కాంగ్రెస్.. టీడీపీ, జనసేన కూటమి తెలంగాణలో కలిసిమెలిసి ఉంటున్నాయి.
ఇన్నాళ్లు అంతర్గతంగా సాగిన తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటనతో ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు అన్నం తినకుండా బాధపడినట్టు ప్రకటించిన పవన్‌కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. తెలంగాణ వ్యతిరేక టీడీపీ అధినాయకుడు చంద్రబాబునాయుడు కుట్ర వ్యూహాన్ని పవన్‌కల్యాణ్ అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్లలోనే తెలంగాణ పరిస్థితి మళ్లీ సమైక్య రాష్ట్రంలో ఉన్నట్టుగా మారుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే తెలంగాణలోని ఉన్నతస్థాయి అధికార వర్గాల్లో ఆంధ్రా పెత్తనం మళ్లీ మొదలైంది. ప్రతి ప్రభుత్వ శాఖలోని కీలకమైన పోస్టుల్లో ఏపీవారే ఉంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు వ్యవస్థపై విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి.. తాను సీఎం అయ్యాక ఆంధ్రా ప్రాంతం వారినే సలహాదారులుగా నియమిస్తున్నారు. కీలకమైన అన్ని శాఖలకు ఉన్నతాధికారులుగా ఆంధ్రా వ్యక్తులకే అవకాశం ఇస్తున్నారు. సాగునీరు, ఆర్థిక, ఇంధన శాఖలను ప్రస్తుతం ఆంధ్రా ప్రాంత అధికారులే నడిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఆంధ్రా కాంట్రాక్టులకే పనులు అప్పగిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నుంచి మకాం మార్చిన అనేక ఆంధ్ర కాంట్రాక్టు సంస్థలు రెండున్నేండ్లలోనే మళ్లీ ఇక్కడ స్థిరపడ్డాయి. తెలంగాణలోని కాంట్రాక్టులు దక్కాలంటే అమరావతి నుంచి చెప్పించుకొంటే చాలనే అభిప్రాయం నెలకొన్నది.
శాంతిభద్రతలతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమనే విధానంతో నాడు బీఆర్ఎస్ పాలన సాగింది. హైదరాబాద్‌లో అసాంఘిక కార్యక్రమాలపై బీఆర్ఎస్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. కానీ కాంగ్రెస్ హయాంలో అంతా మారిపోయింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో విలువైన భూముల విషయంలో పాత పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అండదండలతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపార సంస్థలు హైదరాబాద్‌లోని భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నాయి. నిబంధనల్లోని లొసుగులను ఆసరా చేసుకొని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నది. మరోరకంగా చెప్పాలంటే దగ్గరుండి సహకరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. కీలకమైన శాఖల్లో ఆంధ్రా ప్రాంత అధికారులే ఉండటంతో దందాలు సాఫీగా సాగుతున్నాయని చెప్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా దోపిడీ కార్యాచరణ మళ్లీ మొదలైన పరిస్థితి నెలకొన్నది. కృష్ణా నదీజలాల తరలింపు విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రాయలసీమకు సాగునీటి పేరుతో జల దోపిడీకి పాల్పడుతున్నది. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగినా, బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకొన్నది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం వద్ద, ట్రిబ్యునల్ వద్ద బలమైన వాదన వినిపించి కృష్ణా నదీజలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేమీ పట్టనట్టుగా ఉంటున్నది. తాత్కాలికమైన రాజకీయాల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ర్టానికి శాశ్వతంగా అన్యాయం చేస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.