Pawan Kalyan | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): అక్కినేని కుటుంబంపైనా, నటి సమంత పైనా అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సినీలోకం భగ్గుమంటున్నది. బుధవారం ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా మొదలైన విమర్శలు గురువారం నాటికీ ఆగలేదు. దాదాపుగా టాలీవుడ్ ప్రముఖులందరూ ఆ ఇష్యూపై స్పందించారు. తమిళ, మలయాళ ఇండస్ట్రీలతోపాటు బాలీవుడ్ సినీ తారలు సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సినీ తారల జోలికి రావొద్దంటూ గట్టిగానే సమాధానమిచ్చారు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీ విల్నాట్ టాలరేట్ (సినీరంగం ఏమాత్రం ఉపేక్షించదు) అనే ట్యాగ్‌లైన్‌తో నటీనటులు, దర్శకులు ప్రకటనలు విడుదల చేశారు. తెలుగునాట ఇంత రచ్చ జరుగుతుంటే.. ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు.
చిరంజీవితోపాటు మెగా ఫ్యామిలీ తారలందరూ స్పందించినా.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతారేమోనని తెలంగాణలోని ఆయన అభిమానులు మరీ ముఖ్యంగా మహిళా అభిమానులు ఎదురుచూశారు. అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో తన సహనటిగా ఉన్న సమంతపై వాఖ్యలను ఆయన ఖండిస్తారేమోనని వారంతా ఆశించారు. హైడ్రా కూల్చివేతలపై స్పందించినట్టుగానే దీనిపైనా స్పందిస్తారని అందరూ భావించారు. సినీతారల వ్యక్తిత్వహననం చేస్తూ కాంగ్రెస్ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీ నేతగా కాకపోయినా.. ఫిల్మ్ సెలబ్రిటీగానైనా ఆయన స్పందించి ఉంటే బా గుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గురువారం తిరుపతిలో జరిగిన వారాహి సభలో నైనా ఆయన ఈ అంశంపై మాటవరసకైనా మాట్లాడుతారేమోనని మీడియా వర్గాలు సైతం భావించాయి. సాధారణంగా మహిళా అభ్యున్నతి, గౌరవమర్యాదల గురిం చి తీవ్ర ఉపన్యాసాలిచ్చే పవన్.. అక్కడా ఒక్క ముక్క మాట్లాడలేదు. ఆయన మౌనంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొండా సురేఖ వ్యాఖ్యలపై బుధవారం రోజే జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. నేరుగా మంత్రి పేరును ప్రస్తావిస్తూ దీటుగా సమాధానమిచ్చారు. అయితే నందమూరి కుటుంబానికి నిజమైన వారసులుగా చెప్పుకునే ‘యువరత్న’ బాలకృష్ణ గానీ, ఆయన కుటుంబానికి చెందిన నటులుగానీ సురేఖ వ్యాఖ్యలను ఎక్కడా ఖండించలేదు. చిన్న ప్రకటన విడుదల చేసినా సరిపోయేదని, కానీ ఆయన ఏఎన్నార్ కుటుంబంపై బురద చల్లించే వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాబు-రేవంత్ సఖ్యత వల్లే బాలకృష్ణ స్పందించలేదా? లేక ఏఎన్నార్ కుటుంబంతో ఉన్న గ్యాప్ కారణంగానే మాట్లాడలేదా? లేక స్థానిక ప్రభుత్వంతో ఎందుకు వచ్చిన చిక్కులని భావించారా? అనేది తెలియడం లేదని సినీ విశ్లేషకులు ఒకరు వ్యాఖ్యానించారు.