కరీంనగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి తనకు అలవాటైన శైలిలో పచ్చి అబద్ధాలు ఆడారు. ఇవ్వనివి ఇచ్చినట్టు చెప్తూ అసత్య ప్రచారంతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశా రు. యథావిధిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా ఆయన కుటుంబసభ్యులపై అక్కసు వెల్లగక్కారు. ఈ క్రమంలో అభంశుభం ఎరుగని చిన్నారులను అవమానించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతిబాట’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. వాస్తవానికి ఇది అధికారిక కార్యక్రమమైనా.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభగా మారింది.
గుమ్లాపూర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసి న వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీకి మధ్య స్నేహం ఉన్నదని చెప్పేందుకు అవిభక్త కవలలైన ‘వీణా-వాణి’ని ప్రస్తావించారు. రెండు పార్టీలు వేరైనా, ఆలోచన ఒకేలా ఉంటుందని చెప్పేందుకు వీణా-వాణి గురించి ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. ఏదో ఒక్కసారి అంటే పొరపాటున వారి పేర్లు పలికారని భావించవచ్చు. కానీ సీఎం మూడు, నాలుగుసార్లు ఆ చిన్నారుల పేర్లను ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం సహజమే అయినా అవిభక్త కవలలకు అంటగట్టి బాడీషేమింగ్ చేయడం ఏమిటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మున్సిపాలిటీలకు ఇవ్వని నిధులను ఇచ్చినట్టు సీఎం ప్రచారం చేసుకున్నారు. రెండేండ్ల లో రూ.2,778 కోట్లు ఇచ్చామని చెప్పగా, కానీ అవన్నీ పచ్చి అబద్ధాలని అధికార వర్గాలే తెలిపాయి. కాంగ్రెస్ వచ్చాక కరీంనగర్‌కు కేవలం రూ.65 కోట్లు, చొప్పదండికి రూ.15 కోట్లే ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే రూపా యి ఇచ్చి 10రూపాయలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని, ఇక అభివృద్ధి బాధ్యత తీసుకొంటే ఎన్ని నిధులిస్తారో, ఏ స్థాయిలో ప్ర చారం చేసుకుంటారో విమర్శిస్తున్నారు.
దేవుళ్లు, ఆలయాల పేర్లను ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై రేవంత్ విమర్శలకు దిగారు. సమ్మక్క, సారలమ్మ జాతర కోసం మేడారంలో 100 రోజుల్లో రూ.కోట్లతో ఏర్పాట్లు చేశామని, తమ మంత్రివర్గ మంతా అక్కడే ఉన్నదని, కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా మేడారం వెళ్లలేదని అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు పలుమార్లు మేడారం వెళ్లి తులాభారం కూడా వేయించుకున్నారు. కనీస అవగాహన లేకుండా సీఎం విమర్శలు చేయడంపై మండిపడుతున్నారు.
గుమ్లాపూర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోవడం కనిపించింది. మధ్యాహ్నం 2.45 గంటల నుంచి సీఎం కార్యక్రమాల షెడ్యూల్ ఉన్నది. కానీ మధ్యాహ్నం 3.55 గంటలకు శంకుస్థాపనలు పూర్తి చేసుకొని సభా వేదికపైకి సీఎం చేరుకున్నారు. 4.35 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆలస్యంగా రావడం, కేసీఆర్‌పై ఆక్రోశం వెల్లగక్కడం, అసత్య ప్రచారాలతో కూడిన రొడ్డకొట్టుడు ప్రసంగంతో ప్రజలకు ఆసక్తి సన్నగిల్లింది. దీంతో రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే మహిళలు సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. వెనుక భాగం లో కూర్చున్న వారే కాకుండా మధ్యలో కూర్చున్న మహిళలూ కూడా పెద్ద సంఖ్యలో లేచి వెళ్లిపోయారు. వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీల్లో కూర్చొన్న జనం బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం కనిపించింది.