నల్లగొండ ప్రతినిధి, జూన్2(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌తో ఫిక్సింగ్ చేసుకొని పవన్‌కల్యాణ్ కొత్త డ్రామాలకు తెరలేపారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం పార్టీ యువనేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన ఈ-క్లాస్రూమ్ యాప్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
పవన్‌కల్యాణ్ సభను ఎవరు అడ్డుకున్నారో స్పష్టం చేయకుండా… ఏదేదో ఊహించుకొని మాట్లాడటం తగదని పేర్కొన్నారు. బువ్వ పెట్టి సాది, అభివృద్ధిలో కీలకమైన తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదని పవన్‌కు హితవు పలికారు. గతంలోనూ బీఆర్ఎస్ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించి సభలు నిర్వహించామని గుర్తు చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి తీరు తెలంగాణపై ఆయన చిత్తశుద్ధిని మరోసారి బయటపెట్టిందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఎండవేడిమి పేరుతో పట్టుమని పది నిమిషాలు కూడా ప్రసంగించలేదంటేనే సీఎం తీరును అ ర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాల ని డిమాండ్ చేశారు. ఓవైపు వానకాలం మొదలవుతుంటే ఇంకా వడ్ల కొనుగోలుపై మంత్రులు సమీక్షలు నిర్వహిస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్, ఇస్లావత్ రాంచందర్‌నాయక్, యువ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి, పాల్గొన్నారు.