యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి దేవస్థానంలో మహా వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవములలో (Pavitra Utsavas) భాగంగా గురువారం ఉదయం స్వామి వారికి నవకలశ స్నాపనం జరిగింది. యజ్ఞశాలలో ద్వార తోరణ పూజ, కుంభారాధన, చక్రబ్జమండలారాధన నిర్వహించి ప్రత్యేక హోమాలు జరిపారు. నిత్య లఘు పూర్ణాహుతి జరిగాక గర్భాలయములో మూల స్వామి వారికందరికి లఘు పవిత్ర ధారణ నిర్వహించారు. అనంతరం మహా నివేదన తీర్ధ ప్రసాద వితరణ గావించారు.
కాగా, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ్టి నుంచి వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఏడాది కాలం నుంచి ఆస్థాన పరంగా, భక్తుల మొక్కు పూజల నిర్వహణలో తెలిసీ, తెలియకుండా జరిగే పొరపాట్ల (దోషాలు) నివారణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.