నీలగిరి, జూన్ 19: నల్లగొండ జిల్లా ఆర్డీవో కార్యాలయంలోని సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) పవన్‌కుమార్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలో ఓ ఫిర్యాదుదారు తల్లి, అత్తకు చెందిన భూములను సర్వే చేసేందుకు డీఐ పవన్‌కుమార్ రూ.35వేలు డిమాండ్ చేశారు. భూమి సర్వే చేసిన రోజున ఫిర్యాదుదారు నుంచి రూ.20 వేలు తీసుకున్నారు.
వాటికి సంబంధించిన రిపోర్టు ఇచ్చేందుకు మరో రూ.15వేలు ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు శుక్రవారం కలెక్టరేట్ సమీపంలో రూ.15వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఐని అదుపులోకి తీసుకొని శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.