హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 101 మెగా రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. రక్తదాన శిబిరాల్లో 3,315 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. రాష్ట్రంలోని 11 రీజియన్లలోని అన్ని డిపోలు, యూనిట్లలోని ఉద్యోగులు, సిబ్బందితో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన వారి నుంచి 3,315 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఆర్టీసీ సంస్థ పిలుపు మేరకు స్పందించిన రక్తదాతలకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. సేకరించిన రక్తాన్ని రోడ్డు ప్రమాదాల బాధితులకు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు అందజేస్తామని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వెల్లడించారు.