Patnam Narender Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 14 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా రైతుల తిరుగుబాటు ఘటనలో పోలీసులు తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, రిమాండు రిపోర్టులో పేర్కొన్న ఆరోపణలన్నింటితో విభేదిస్తున్నానని పేర్కొన్నారు. చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్న నరేందర్‌రెడ్డి ఈ మేరకు గురువారం తన న్యాయవాదులకు అఫిడవిట్ అందించారు. దానిని కొడంగల్ జ్యుడీషియల్ కోర్టులో దాఖలు చేయాల్సిందిగా కోరారు.
రెండు రోజుల క్రితం ఉదయం 7 గంటలకు కేబీఆర్ పార్కు వద్ద ఉన్న తనను మఫ్టీలో ఉన్న పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఉదయం 9.30-10:00 గంటలకు పరిగి డీటీసీకి తీసుకువెళ్లి నిర్బంధించారని, ఈ క్రమంలో ఏ ఒక్క పోలీసు కూడా తనతో మాట్లాడలేదని, తాను ఎలాంటి స్టేట్మెంటూ ఇవ్వలేదని స్పష్టంచేశారు. పోలీసులు తనను ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి, కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత కేవలం పది నిమిషాల వ్యవధిలోనే న్యాయమూర్తి ముందు హాజరుపరిచారని తెలిపారు. తనను ఈ కేసులో ఏ-1గా చేర్చారన్న విషయం సాయంత్రం 4.30 గంటల వరకు పోలీసులు చెబితేగానీ తెలియలేదని పేర్కొన్నారు.
అన్యాయంగా తనను ఈ కేసులో ఏ-1గా చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేంత వరకు కూడా తనను అరెస్టు చేసినట్టు తన భార్య, కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదని వివరించారు. తమ పార్టీ నాయకుడు కేటీఆర్, ఇతరుల సూచనల మేరకు ఈ కేసులో తాను కీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాననే కట్టుకథను పోలీసు వాంగ్మూలంలో పేర్కొన్నారని, దీన్ని గురువారం తన భార్య చెబితే విని ఆశ్చర్యపోయానని అన్నా రు. తాను పోలీసులకు వాం గ్మూలం ఇచ్చాననేది ఒట్టి బూటకమని స్పష్టంచేశారు. తన రాజకీయ ప్రత్యర్థులు, వ్యతిరేకుల ఆదేశానుసారం పోలీసులు చేసిన ఆరోపణలన్నింటితో తాను తీవ్రంగా విబేధిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఈ వాస్తవాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని, తగిన న్యాయం చేసేలా ఉత్తర్వులు జారీచేయాలని నరేందర్‌రెడ్డి తన అఫిడవిట్లో మెజిస్ట్రేట్‌ను కోరారు.
పరిగి, నవంబర్ 14: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టు చేసి పరిగి సబ్‌జైలులో ఉంచిన 16 మంది రైతులను గురువారం సంగారెడ్డి జైలుకు తరలించారు. పరిగి సబ్ జైలు కొడంగల్‌కు సమీపంలోనే ఉన్నది. దీంతో ములాఖత్ కోసం ఎక్కువ మంది వస్తున్నారనే కారణంతోనే సంగారెడ్డి జైలుకు పోలీసు బందోబస్తు మధ్య తరలించారని సమాచారం.