హుజూరాబాద్‌రూరల్, జూన్ 1 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఏరియా దవాఖానలో ఓ వృద్ధురాలికి మధ్యలోనే ఆపరేషన్ నిలిపేసిన ఘటన చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. హుజూరాబాద్ మండలం అంబేద్కర్ నగర్‌కు చెందిన కొండ లలితను గత నెల 26న ద్విచక్రవాహనం ఢీకొట్టగా కుటంబసభ్యులు 108 వాహనంలో హుజూరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. కాలు విరిగిందని, అపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. సీఏఅర్ఎం మిషన్ చెడిపోయిందని, నాలుగు రోజుల్లో మరమ్మతు చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తామని వైద్యులు తెలిపారు.
అదివారం మరమ్మతు చేయించి సోమవారం లలితను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఆపరేషన్ మధ్యలోనే మిషన్ చెడిపోవడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకువెళ్లాలని వైద్యులు సలహా ఇచ్చారు. మధ్యలోనే ఆపరేషన్ ఆపేయడంతో వృద్ధురాలు విపరీతమైన బాధను అనుభవించారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇక్కడ అరోగ్యశ్రీని క్యాన్సిల్ చేస్తేనే మరో దవాఖానలో అప్రూవల్ అవుతుండగా, రోగిని ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు.