వేములవాడ రూరల్/కలెక్టరేట్ (సిరిసిల్ల) సెప్టెంబర్ 30: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెటూరి పిల్లాడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. మెదడుకు పదు ను పెట్టి ప్యాడీ ఫిల్లింగ్ మెషిన్ రూపొందించి పేటెంట్ పొందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన మర్రిపల్లి లక్ష్మీరాజం-రాజవ్వ దంపతుల కొడుకు అభిషేక్. 2019లో హన్మాజీపేట జడ్పీహెచ్ఎస్లో ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఇన్స్పైర్ పోటీల్లో భాగంగా ధాన్యాన్ని సులభంగా సంచుల్లో నింపేందుకు ప్యాడీ ఫిల్లింగ్ యంత్రాన్ని రూపొందించాడు. ముగ్గురు చేసే పనిని ఒక్కరే చే యవచ్చు.
అదే ఏడాది సిరిసిల్లలో జరిగిన ఇన్స్పైర్ పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంతోపాటు రాష్ట్రస్థాయి ప్రదర్శనలో అవార్డు దక్కింది. ఢిల్లీ నేషనల్ సైన్స్ ఫెయిర్లో మూడో స్థానం లభించింది. ఇటీవల అభిషేక్ తండ్రి లక్ష్మీరాజం పేరిట పేటెంట్ కో సం దరఖాస్తు చేసుకున్నాడు. కేంద్రం ఇటీవలే పేటెంట్ మంజూ రు చేసింది. శనివారం రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ పేటెంట్ పత్రాలు అందజేశారు.