సూర్యాపేట, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని నమ్ముకుంటే నట్టేట ముంచారని, ఆత్మహత్యే శరణ్యమనేలా తన పరిస్థితి తయారైందని సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సూర్యాపేటలో తాను పార్టీని బలోపేతం చేస్తుంటే.. రెండుసార్లు ఓడిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని మూడోసారి బరిలో దింపారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ తనకు టికెట్ కేటాయించే విషయంలో రెండుసార్లు మోసం చేశారని మండిపడ్డారు. 2015లో రేవంత్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరానని, 2018 ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఇవ్వలేదని చెప్పారు. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్‌ను గురువారం రాత్రి దామోదర్‌రెడ్డికి కేటాయించిన వెంటనే జాతీయ రహదారిపై రమేశ్‌రెడ్డి అభిమానులు రాస్తారోకో చేశారు. శుక్రవారం రమేశ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.