హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఈనెల 21న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 నెలల పాటు 9వేల మందికిపైగా కానిస్టేబుళ్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈనేపథ్యంలో మొదటి దశ శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఐటీఅండ్‌సీ, పీటీవో కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్ హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ సహా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 పీటీసీ, డీటీసీల్లో ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించనున్నారు. ఆయా జోన్ల పరిధిలో జరిగే పరేడ్‌కు అడిషనల్ డీజీలు, ఐజీలు, కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు, జిల్లా స్థాయిలోని డీటీసీల్లోని పరేడ్‌కు ఎస్పీలు హాజరుకానున్నట్లు సమాచారం.
కేసీఆర్ హయాంలోనే పరీక్షలు, ఫలితాలు
ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2022 ఏప్రిల్‌లో 16,604 కానిస్టేబుల్, 587 ఎస్సై తత్సమాన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిల్లో 587ఎస్సై ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించి గతేడాది ఆగస్టులోనే నియామకపత్రాలు అందించారు. ఇక కానిస్టేబుల్ తుది ఫలితాలు గతేడాది అక్టోబర్‌లోనే విడుదలయ్యాయి. ట్రాన్స్లేషన్ సమస్యపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడం.. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో తుది ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఇటీవల సుప్రీం కోర్టులో టీఎస్ఎల్పీఆర్బీ కేసు గెలిచింది. ఇక నియామక పత్రాలు అందించేందుకు సీఎం రేవంత్ సిద్దమయ్యారు. గత ఫిబ్రవరి 14న 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా ఆయన నియాకమ పత్రాలు అందజేసి, వాటిని కూడా తన ఖాతాలో వేసుకున్నారు.