నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ (Miryalaguda) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని చింతపల్లి బైపాస్ రోడ్డు వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను మిర్యాలగూడ దవాఖానకు తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. నెల్లూరుకు చెందిన పెండ్లి బృందం ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతురాలిని నునావత్ సునీతగా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ నునావత్ సైదాతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న రాజశేఖర్, నాగచరిత, శైలజ, రాధ, అఖిల, శివరామకృష్ణ, సురేందర్‌రావు, బస్సు డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.