సిరిసిల్ల రూరల్, జూలై 18: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నేత కర్కబోయిన కుంటయ్య కుటుంబానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. పోలీసులు, కాంగ్రెస్ నేతల వేధింపులతో ఇటీవల కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి అండగా ఉంటానని, కూతుళ్లను చదివింపించి, పెళ్లిళ్లు జరిపిస్తానని హామీ ఇచ్చిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్, జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో కుంటయ్య భార్య విజయ, కూతుళ్లు భార్గవి, దీక్షితను కలిశారు. చిన్న కూతురు దీక్షిత పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ కోసం రూ.3 లక్షల నగదు అందజేశారు. పెద్ద కూతురు భార్గవి పెళ్లి బాధ్యత తనదేనని చెప్పారు. కేటీఆర్కు కుంటయ్య భార్య, కూతుళ్లు కృతజ్ఞతలు తెలిపారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, మాజీ సర్పంచ్ అడ్డగట్ల భాస్కర్, కుర్మ రాజయ్య, క్యారం పర్శరాములు పాల్గొన్నారు.