హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చెప్పేదొకటి, గల్లీలో చేసేదొకటి అని మరోసారి తేలిపోయింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తెలంగాణలో వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీ ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ పేరిట నిర్వహించనున్న సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం, రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు చెప్తున్నారు. అధికారిక ప్రకటనలో మాత్రం ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు ఈ అంశం కాంగ్రెస్ చిత్తశుద్ధికి పరీక్షగా మారింది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్రంలోని బీజేపీ సర్కారు పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని కాంగ్రెస్ పెద్దలు వివిధ వేదికలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఢిల్లీలో వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏర్పాటును కాంగ్రెస్ జాతీయ నాయకుడు జైరాం రమేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రంపై పలు ప్రశ్నలు సంధించారు. జంతు సంరక్షణ కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. ఢిల్లీ జూ కేంద్ర అటవీ, పర్యావరణశాఖ పరిధిలోకి వస్తుందని, ప్రైవేటు వ్యక్తులకు జూ అప్పగించడం సరికాదని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు కేంద్రం మీద కాంగ్రెస్ ఎక్కుపెట్టిన ప్రశ్నలనే… పర్యావరణ ప్రేమికులు కాంగ్రెస్ మీద సంధిస్తున్నారు. ఢిల్లీలో వంతారాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ… అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధం కావడం ద్వంద్వనీతి కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వేదికలపై ప్రసంగాలు ఇస్తుంటారు. కానీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వంద ఎకరాల అడవిని నరికివేస్తే ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
అదానీతో రాహుల్ కుస్తీ.. రేవంత్ దోస్తీ
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి స్నేహం కూడా కాంగ్రెస్ చిత్తశుద్ధిపై ప్రశ్నలు వ్యక్తమయ్యేలా చేసింది. దేశంలో ప్రధాని నరేంద్రమోదీతో స్నేహం కారణంగానే గౌతమ్ అదానీ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా భారత్‌జోడో యాత్రలో గళమెత్తారు. లోక్‌సభలో మోదీని నిలదీశారు. మోదీ, అదానీ దోస్తీని ఎండగట్టారు. అమెరికాలో వ్యాపార అక్రమాలకు పాల్పడిన అదానీని మోదీ రక్షిస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు చాలామంది విమర్శలు గుప్పించారు.
కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో అదానీతో వేలకోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల డొనేషన్ తీసుకున్నారు. కానీ.. రేవంత్ చర్యతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పెద్దలు, రాహుల్ గాంధీ ఝూటా మాట లు మాట్లాడుతున్నారని, దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ తెలంగాణలో ఒప్పందాలు ఎలా చేసుకుంటారని మిత్రపక్షాలు కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది. అధిష్ఠానంతో రేవంత్‌కు దూరం పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు అంబానీతో దోస్తీ విషయంపైనా విమర్శలు వస్తున్నాయి.