హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defecting MLAs) విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్లి ప్రారంభించారు. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరుగనుంది. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆయనను తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది. సంజయ్‌పై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని ఆయన తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
శుక్రవారం మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. ఉదయం 11 గంటలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది. పోచారంపై జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయనను పోచారం తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరుగనుంది. సంజయ్‌ను గాంధీ తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. 12, 13 తేదీలలో స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు. కాగా, ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా ఈరోజు నుండి అసెంబ్లీలో ఆంక్షలు విధించారు. ఇప్పటికే తొలి దశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తయింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇప్పటి వరకు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే, కీలకమైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. వారికి స్పీకర్ నోటీసులు ఇచ్చారా? వారు సమాధానాలు ఇచ్చారా? లేదా? అన్నదానిపైనా స్పష్టత లేదు. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు స్పష్టమైన ఆధారాలున్న నేపథ్యంలో వారే తమ పదవులకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.