హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నెలలతరబడి జీతాలు ఇవ్వకుంటే కుటుంబాలను పోషించుకునేది ఎలా? అంటూ మైనార్టీ గురుకుల ఔట్సోర్సింగ్, గిరిజన గురుకుల, ఎస్సీ గురుకుల సొసైటీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ, గిరిజన, ఎస్సీ గురుకుల సొసైటీ సిబ్బంది వేర్వేరుగా నిరసన వ్యక్తంచేశారు. జీతాల చెల్లింపు కోసం సోమవారం మైనార్టీ గురుకుల ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రిన్సిపాళ్లకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు పట్టుకుని గురుకులాల ఎదుట నిరసన తెలిపారు. మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారికి వినతిపత్రం సమర్పించారు. మైనార్టీ గురుకులాల్లో ఔట్సోర్సింగ్ ఆధారంగా పనిచేస్తున్న టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి నెలలతరబడి జీతాలు అందడం లేదని మైనార్టీ గురుకుల సొసైటీ ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రాజమ్మద్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు. 15వ తేదీలోగా జీతాలు ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణకు దిగుతామని ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గిరిజన గురుకులంలో ఐదునెలలుగా..
గిరిజన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చే అధ్యాపకులకు ఐదు నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. ఇదే విషయమై అధికారులకు, మంత్రికి గోడువెల్లబోసుకున్నా ఇంతవరకు సమస్య పరిషారం కాలేదని సదరు అధ్యాపకులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ గురుకుల సొసైటీలో రెండు నెలలుగా..
ఎస్సీ గురుకుల సొసైటీలో పనిచేస్తున్న 2,469 మంది పార్ట్ టైం, ఔట్సోర్సింగ్, సబ్జె క్ట్ అసోసియేట్లకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని టిగారియా నేతలు వాపోయారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులను టిగారియా కేంద్ర జనరల్ సెక్రటరీ మధుసూదన్, సోషల్వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ గణేశ్, వరింగ్ ప్రెసిడెంట్ జనార్ధన్ సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.