హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎంపీ భువనేశ్వర్ కలితా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది.
తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని చెప్పారు. మెడికల్ కాలేజీల కోసం ప్రభుత్వం భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను, వాటి వల్ల కలిగిన సామాజిక ఫలితాలను వివరించారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా గర్భిణులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని, దీంతో మాతాశిశుమరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకాల అమలుతీరుపై పార్లమెంటరీ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, డీపీహెచ్ శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.