రామంతాపూర్, ఏప్రిల్ 17: ఫీజుల పెంపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) ప్రధాన ద్వారం వద్ద వందల మంది తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల కోర్ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత నాలుగేండ్లలో ఫీజులు ఏకంగా 141% పెరిగాయని చెప్పారు. 2021లో ఒకో విద్యార్థి ఫీజు సుమారుగా రూ.83,630 ఉండగా, 2025 నాటికి అది రూ.2,01,628కి చేరిందని తెలిపారు.
పాఠశాల నిర్వహణ ఖర్చులను భరించడానికి ఇప్పటికే వసూలు చేసిన ఫీజులు సరిపోతాయని వెల్లడించారు. రాబోయే ఐదేండ్లపాటు ఫీజులను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ నిరసనకు హెచ్‌పీఎస్ బేగంపేట్ శాఖకు చెందిన తల్లిదండ్రుల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారని పేర్కొన్నారు.
ఫీజుల పెరుగుదల ఉండదని పాఠశాల యాజమాన్యం లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు మొదటి టర్మ్ ఫీజు చెల్లింపు నిలిపివేయాలని తల్లిదండ్రులు తీర్మానించినట్టు తెలిపారు. అధిక ఫీజులు ఉన్నప్పటికీ ఆహారం, క్రీడా, మౌలిక సదుపాయాలు, విద్యారంగంలో నా ణ్యత దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్త ంచేశారు. తన పదవిని 14 ఏండ్లుగా అనుభవిస్తూ, రిటైర్ అయినా మళ్లీ తన కాలపరిమితిని పొడిగించుకున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.