గణపురం, డిసెంబర్ 14 : తమ పిల్లలతో మాట్లాడనివ్వాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్‌లోని ఎంజేపీ ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. రెండో శనివారం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చూసేందుకు ఫూలే వసతిగృహానికి ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. ఇదే సమయంలో డైట్‌ను ప్రారంభించేందుకు మంత్రులు అకడికి రావాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వేచియున్న తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడించాలని ఉపాధ్యాయులతో మొరపెట్టుకున్నారు. అయినా, ఉపాధ్యాయులు వినకపోవడం, ప్రిన్సిపాల్ చేరుకొని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శైలజ వచ్చి వారిని సముదాయించి, విద్యార్థులతో మాట్లాడించారు.