బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 16: గురుకుల సిబ్బంది నిర్లక్ష్యంతో పాఠశాలలో విద్యార్థినులకు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల గేటు ఎదుట విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం ఆందోళనకు దిగారు.
తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని గేటు ఎదుట బైఠాయించారు. పాఠశాలలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థినిని వరుసకు అన్న అయ్యే వ్యక్తి వచ్చి బయటికి తీసుకెళ్లిన ఘటన జరగడం ఆందోళన కలిగించిందని తల్లిదండ్రులు గుర్తుచేశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే సదరు యువకుడు లోపలికి వచ్చాడని ఆరోపించారు. ఈ విషయమై సబ్‌కలెక్టర్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. పాఠశాలను సందర్శించి, అక్కడే ఒక రోజు బస చేసి పరిస్థితులను తెలుసుకుంటానని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.