కోరుట్ల, నవంబర్ 22: తల్లిదండ్రులు తరుచూ గొడవపడుతుండటంతో మనస్తాపం చెందిన 13 ఏండ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటుచేసుకున్నది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని రథాలపంపు కాలనీకి చెందిన మారంపల్లి రవీందర్-అపర్ణ దంపతులకు కుమారుడు విరాట్ (13), కూతురు ధన్వీ ఉన్నారు. రవీందర్ ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేస్తుండగా, అపర్ణ గృహిణి. విరాట్ స్థానిక లిటిల్ జీనియస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా అపర్ణ అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.
కొడుకు విరాట్ వెతుక్కుంటూ కొత్త బస్టాండ్‌కు వచ్చి తల్లిని కలిశాడు. బతిమాలి ఇంటికి తీసుకువచ్చాడు. తల్లిదండ్రులు ఇకమీదట గొడవపడమని లెటర్ రాసి సంతకం చేసి తనకు ఇవ్వాలని చెప్పి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. గడియ తీయాలని ఎంత బతిమిలాడిన తీయకపోవడంతో తల్లిదండ్రులు లేఖ రాసి తలుపు సందులోంచి గదిలోకి వేశారు. తలుపు తీయాలని కోరారు. లోపలి నుంచి ఉలుకూ పలుకు లేకపోవడంతో తలుపు బద్ధలు కొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే విరాట్ ఇంట్లో ఉరేసుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.