గంభీరావుపేట, జూన్ 16 : తమ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట సోమవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పాఠశాల పునఃప్రారంభమై ఐదురోజులు గడిచినా ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే వస్తున్నారని, గతంలో నలుగురు ఉండేవారని తెలిపారు.
పాఠశాలలో 5వ తరగతి వరకు 40 మందికిపైగా చదువుకుంటున్నారని, అంతమంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. వెంటనే విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. పాఠశాలలో సుమారు 220 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులు ఉండగా, ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉండటంతో ఒంటికొస్తే క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారు. సమస్యను గుర్తించిన గత బీఆర్ఎస్ సర్కారు మన ఊరు..మన బడి కింద నిధులు మంజూరు చేసినా..
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మూడేండ్లగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పనులు పూర్తిగా చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో సోమవారం కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ‘మన ఊరు- మన బడి’ కింద రూ.40 లక్షలతో ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూల్లో అభివృద్ధి పనులు చేపట్టాడు. ఇందులో బీఆర్ఎస్ సర్కారు రూ.13 లక్షలు చెల్లించింది.
ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా, మిగతా రూ.27 లక్షల కోసం ప్రభుత్వానికి నివేదించాడు. ఆస్తులు, ట్రాక్టర్, ఎడ్లు అమ్మగా రూ.18 లక్షలు వచ్చాయి. వీటిని బాకీ ఉన్నవారికి చెల్లించాడు. మిగతా రూ.9 లక్షల కోసం బాకీ వాళ్లు వేధిస్తున్నట్టు తెలిపాడు. 18 నెలలు గడిచినా డబ్బులు రాకపోవడంతో గ్రామస్థులతో కలిసి పాఠశాలకు తాళం వేసి ఆందోళన నిర్వహించాడు. బిల్లులు చెల్లించకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాస్ హెచ్చరించాడు.