గణపురం, ఏప్రిల్ 10 : ‘కేటీకే ఓసీ-3 నుంచి వచ్చే దుమ్ము, ధూళితో రోగాలతో చస్తున్నం.. వ్యవసాయ భూములను సింగరేణికి అప్పగించడంతో ఉపాధి లేక ఉపాసముంటున్నం’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి త్వరగా తరలించి, తమ కు పునరావాస ప్యాకేజీ అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేటీకే ఓసీ-3 ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మార్చి 10న ఓసీ త్రీ ఎదుట ధర్నా నిర్వహించినప్పుడు సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి వచ్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నెలరోజుల్లో పరిషరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినా, నేటికీ పరిష్కారం కాలేదన్నారు. ఎంతో విలువైన పంట పొలాలు తీసుకొని గ్రామాన్ని తరలించకపోవడం వల్ల ఉపాధి లేక పస్తులు ఉంటున్నామని, గ్రామంలో తాగునీరు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాన్ని తరలించే వరకు ధర్నాను విరమించేది లేదని, పురుగుమందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించారు. ఎస్సై రేఖాఅశోక్, భూపాలపల్లి, టేకుమట్ల, రేగొండ ఎస్సైలతో పాటు పోలీసులు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, అడిషనల్ జీఎం కవీంద్ర, చిట్యాల సీఐ మల్లేశ్‌యాదవ్ గ్రామస్తులతో మాట్లాడి వారం రోజుల్లో సింగరేణి సీఎండీతో మాట్లాడించి సమస్య పరిషరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.