హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో వివిధ క్యాటగిరీల్లోని 9,026 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) 9 నోటిఫికేషన్లు జారీచేసి ఇటీవల పరీక్షలు నిర్వహించింది. వీటిలో మహిళలకు 79.78% పోస్టులు కేటాయించడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై జస్టిస్ పీ మాధవిదేవి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మొత్తం పోస్టుల్లో 79.78% మహిళలకే రిజర్వు చేయడంతో పురుష అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదించారు. దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ కోటానూ సమాంతరంగా అమలు చేయాలని కోరారు. దీం తో ఏకీభవించిన ధర్మాసనం రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.