సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 22 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు సిరిసిల్ల డీఎస్పీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రియాంక తిరుపతి ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. వివరాలు ఇలా… వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణాకు చెందిన ప్రియాంక తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. గ్రామానికి చెందిన నలుగురు కాంగ్రెస్ నాయకులు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఇంకుడు గుంతల విషయంలో జీపీ కార్యాలయంలో అందరి ముందే కార్యదర్శిని దూషించినట్టు సమాచారం. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో తాము సూచించిన వారినే ఎంపిక చేయాలని, గ్రామ సభలు లేకుండా ప్రకటించాలని, తర్వాత ఏమైనా తామే చూసుకుంటామని బెదిరించినట్టు విశ్వసనీయ సమాచారం. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితా అందజేయాల్సి ఉండగా, ఆమె ఆఫీస్‌కు రాలేదు.
తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు మధ్యాహ్నం ఎంపీడీవో లక్ష్మీనారాయణకు వాట్సాప్‌లో లేఖను పోస్ట్చేసింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె రాసిన లేఖ, డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్‌ను ట్రెస్ చేయగా తిరుపతిలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసుల సహకారంతో ప్రియాంక తండ్రి రాజేశం, కుటుంబ సభ్యులు తిరుపతి బయలుదేరారు. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మీనారాయణను వివరణ కోరగా, సోమవారం మధ్యాహ్నం తనకు వాట్సాప్ ద్వారా రాజీనామా లేఖ పంపిందని తెలిపారు. తర్వాత తాను ఫోన్ చేయగా, స్విచ్చాఫ్ వచ్చిందని అన్నారు. డీపీవోను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని వాట్సాప్ ద్వారా తాను తిరిగి మెసేజ్ చేసినట్టు వివరించారు. తన కూతురిని ఇబ్బందిపెట్టొదని కాంగ్రెస్ నాయకులను కోరినా.. వారు వేధింపులు ఆపలేదని తండ్రి రాజేశం ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్.. ప్రియాంక తండ్రి రాజేశంతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.