అమీన్పూర్, నవంబర్ 21 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో లంచం డిమాండ్ చేసిన కేసులో సచిన్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. ఐలాపూర్‌కు చెందిన మల్లేశ్ ఇంటి నంబర్ కోసం కార్యదర్శి సచిన్‌ను సంప్రదించగా రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.
మొదట రూ.10 వేలు ఇచ్చాడు. మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పిన మల్లేశ్ కార్యదర్శిపై ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 29న బీరంగూడ రావాలని పిలిపించుకొని లంచం డిమాండ్ చేసిన మాటలను మల్లేశ్ రికార్డు చేశాడు. ఈ రికార్డు ఆధారాలను ఏసీబీకి అందజేశాడు. కాగా సచిన్ ఇటీవలే సదాశివపేట మండలం ఆత్మకూర్‌కు బదిలీపై వెళ్లారు. అధికారులు గురువారం సచిన్ ను అమీన్పూర్ కార్యాలయానికి పిలిపించి సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మహబూబాబాద్ రూరల్, నవంబర్ 21: మహబూబాబాద్ కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ ఏసీబీకి పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన యువకుడు తాళ్ల కార్తీక్ మహబూబాబాద్ శివారులో మూడు ఎకరాలు కొనేందుకు సిద్ధమయ్యాడు.
ఈ భూమి సర్వే నంబర్లు, వివాదాలకు సంబంధించిన వివరాల కోసం నక్షకు కలెక్టరేట్లోని సర్వే, భూమి రికార్డుల విభాగంలో గత నెల 28న దరఖాస్తు చేశాడు. దీనికి సంబంధించి సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ జ్యోతి క్షేమాబాయి చలానా తీయాలనగా 5 వేలు ఇచ్చాడు. రెండ్రోజుల తర్వాత నక్ష మ్యాప్ కోసం ఆఫీస్‌కు వెళ్లగా రూ.20 వేలు ఇస్తేనే మ్యాప్ వస్తుందని జ్యోతీక్షేమాబాయి చెప్పింది. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆమెకు 20 వేలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.