కాల్వశ్రీరాంపూర్/ పెద్దపల్లి, జూలై 12 : పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో ఓదెల మండల ఇన్చార్జి పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పెందోట జగదీశ్బాబు శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ విజయకుమార్ కథనం ప్రకారం.. ఎలిగేడు మండల ఏఈ జగదీశ్బాబు కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండల ఇన్చార్జి పీఆర్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు.
ఓదెల మండలం బాయమ్మపల్లికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఎంబీ రికార్డు చేయాలని ఏఈ జగదీశ్బాబును అభ్యర్థించారు. దీనికోసం ఏఈ రూ.లక్ష లంచం డిమాండ్ చేయగా, రూ.90 వేలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారి పక్కన శనివారం కాంట్రాక్టర్ రాజు నుంచి ఏఈ రూ. 90వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని రిమాండ్కు తరలించారు.