హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకున్నది. పల్లెల్లో సందడి నెలకొన్నది. మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఊపుమీదున్న తొలివిడత ప్రచారానికి మూడు రోజులే గడువు ఉన్నది. రెండో విడతకు ప్రచారపర్వం షురూ అయింది. తుదివిడత నామినేషన్ల ప్రక్రియ, వాటి పరిశీలన కూడా పూర్తవడంతో ఊరూరా కోలాహలం నెలకొన్నది. అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నది. మూడో విడత చెల్లుబాటైన అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు శనివారం సాయంత్రం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రకటించారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు అప్పీల్‌కు వెళ్లడానికి ఆదివారం వరకు అవకాశం ఉన్నది. సోమవారం వాటిని పరిష్కరిస్తారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉన్నది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను గుర్తులతోపాటు ఆర్వోలు విడుదల చేస్తారు. 9న సాయంత్రం నుంచి తుది విడత అభ్యర్థుల ప్రచారం ప్రారంభం అవుతుంది. వారంరోజుల ప్రచారం అనంతరం 15న సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగిస్తుంది. 17న ఉదయం 7 నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను అదేరోజు ప్రకటిస్తారు.
రెండో విడత అభ్యర్థుల ప్రచారం షురూ
రెండోవిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను శనివారం సాయంత్రం ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల గుర్తులను కూడా కేటాయించడంతో అభ్యర్థులు ఇదేరోజు సాయంత్రం ప్రచారాన్ని మొదలుపెట్టారు. దాదాపు అన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి త్రిముఖ పోటీ, వార్డు సభ్యులకు ద్విముఖ పోటీ ఉన్నట్టు తెలుస్తున్నది. శనివారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు రెండో విడత అభ్యర్థులకు ప్రచారం చేసుకొనే అవకాశం ఉంటుంది. 14న ఉదయం 7 నుంచి ఒంటిగంట వరకు పోలింగ్, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది. మూడు రోజులే మిగిలి ఉండటంతో ప్రతి ఓటరునూ 3-4 సార్లు కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
తొలివిడత ప్రచారం మూడు రోజులే
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు ఇక మూడు రోజులే ప్రచారానికి గడువు ఉన్నది. మంగళవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనున్నది. దీంతో కులాల వారీగా, యువత, గుంపుల వారీగా సమావేశాలు పెట్టి మరీ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దూరప్రాంతాల్లో ఉన్నవారిని రప్పించేందుకు అభ్యర్థులు నిత్యం మాట్లాడుతున్నారు. చార్జీలు డబ్బులు పంపుతున్నారు. 11న తప్పనిసరిగా వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు.
తొలివిడత ఎన్నికలు
రెండో విడత
మూడో విడత
పంచాయతీల సంఖ్య: 4,158
నామినేషన్లు రాని స్థానాలు: 11
పోలింగ్ జరిగే స్థానాలు: 4,147
సర్పంచ్ నామినేషన్లు: 27,277
మొత్తం వార్డులు: 36,442
నామినేషన్లు రాని వార్డులు: 100
పోలింగ్ జరిగే వార్డులు: 36,342
వార్డుల నామినేషన్లు: 89,603
పోలింగ్ జరిగే తేదీ: డిసెంబర్ 17