Telangana | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఇక రాష్ట్రంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలన్నా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఆర్అండ్బీ శాఖ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) విధానంలో నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో దాదాపు 30 వేల కిలోమీటర్ల రోడ్లను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీటీ) నిర్మించనున్నారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో టోల్ గేట్లు రానున్నాయి. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో రెండు రకాలుంటాయి. మొదటిది ఈపీసీ. దీన్ని ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానం అంటారు. ఇందులో ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రైవేట్ సంస్థతో రోడ్ల డిజైన్లు, నిర్మాణం చేయిస్తుంది.
నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది. రెండోది బీవోటీ. దీన్ని బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానం అంటారు. అంటే ప్రైవేట్ కంపెనీలు రోడ్డు నిర్మించి కొన్నేండ్లపాటు టోల్గేట్ల ద్వారా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకుంటాయి. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఆ రోడ్లను ప్రభుత్వానికి అప్పగిస్తాయి. ఈ రెండు విధానాలను కలుపుతూ తెరమీదికి వచ్చిన విధానమే హ్యామ్. ఈ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరిస్తే.. ప్రైవేట్ కంపెనీలు 60 శాతం భరించాల్సి ఉంటుంది. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు టోల్ గేట్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తాయి.
గ్రామాల్లోనూ టోల్గేట్లు?
హ్యామ్ విధానాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కొన్నేండ్లుగా అమలు చేస్తున్నది. ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే వంటివి హ్యామ్ విధానంలోనే నిర్మించారు. నాగ్పూర్-ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్వే, లక్నో-అయోధ్య ఎక్స్ప్రెస్ వే, రాయ్పూర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్వే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. హైవేలకే పరిమితమైన ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామాలకు విస్తరించాలని నిర్ణయించింది. తద్వారా ప్రస్తుతం రాష్ట్ర రహదారులకే పరిమితమైన టోల్గేట్లు సమీప భవిష్యత్తులో గ్రామాల్లోనూ వస్తాయని చెప్తున్నారు. మూడేండ్లలో రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అంటే.. 2028 నుంచి ఊరు దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నమాట!