తూర్పు దిక్కున ఉన్న పంచతల రాజగోపురం నుంచి మొదటి ప్రాకారంలోకి ప్రవేశించి కుడివైపునకు తిరిగితే ఈశాన్యం దిక్కున త్రితల రాజగోపురం కన్పిస్తుంది. ఇదే లక్ష్మీనరసింహుడి ముఖమండపానికి ప్రధాన ద్వారం. పంచతల రాజగోపురంలోకి ప్రవేశించే మార్గంలోనూ.. త్రితల రాజగోపురం నుంచి ముఖమండపంలోకి వెళ్లే ద్వారం వద్ద జయ విజయులు, ఐరావతాలు స్వాగతం పలుకుతాయి. ముఖమండపం ప్రవేశంలోనే ఎడమవైపున స్తంభాలపై హనుమంతుడు, ప్రహ్లాదుడు, యాదమహర్షి, రామానుజుల రూపాలు దర్శనమిస్తాయి. మెట్లు దిగుతూ కిందికి వెళ్తే క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి, ఇంకా కొన్ని మెట్లు దిగితే గండభేరుండస్వామి దర్శనమిస్తారు. ఇక్కడి నుంచి ముఖ మండపంలోకి అడుగుపెడితే రాజప్రసాదంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌లో స్వర్ణకాంతులీనే రెండతస్తుల ముఖ మండపాన్ని చూస్తే అహో! అనాల్సిందే. కాకతీయ శైలిలో స్తంభాలపై అటు ఆరు, ఇటు ఆరు చొప్పున కొలువుదీరిన ఆళ్వారుల విగ్రహాలను, వరుసగా ఉండే ఉపాలయాల్లో లక్ష్మీదేవిని, శయన మండపం, రామానుజుల మందిరం, ధ్వజస్తంభం, బలిపీఠం ఇలా.. అన్నింటినీ దర్శించుకోవచ్చు. పంచలోహ పలకలపై ప్రహ్లాద చరిత్రను కండ్లకు కట్టే చిత్తరువులు, స్వర్ణ కాంతులలో మెరిసిపోయే గర్భగుడి మహాద్వారాన్ని చూసి భక్తులు పరమానందభరితులవ్వాల్సిందే.