‘పల్లె ప్రగతి’ అద్భుతం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కేటాయింపు, డంప్ యార్డు, వైకుంఠధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతోపాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇవాళ ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 84 పంచాయతీలకు మాత్రమే సొంత ట్రాక్టర్లు ఉండేవి.. నేడు 12,765 పంచాయతీలకు 12,681 ట్యాంకర్లు సమకూర్చామని తెలిపారు.
పంచాయతీల ప్రగతి ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. ఇంకా ఏమన్నారంటే.. గతంలో అడవులు నరకడమే తప్పా పెంచలేదు. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇచ్చింది. పచ్చదనం, పరిశుభ్రత విషయాల్లో దేశానికే ఆదర్శంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 12,755 నర్సరీలు ఏర్పాటు చేశాం. మొక్కల నాటింపు, సంరక్షణ బాధ్యతగా జరుగుతున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 91శాతం బతికాయి. రాష్ట్రంలోని 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 19,027 చోట్ల స్థలాలను గుర్తించి 15,646 చోట్ల మొక్కలను సైతం నాటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
అన్నివసతులు సమకూర్చాం...
రైతులు కూర్చొని చర్చించుకునేందుకు క్లస్టర్‌కో రైతు వేదికను ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల నిర్మాణం తలపెట్టగా ఇప్పటికే 2580 పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. 91శాతం పనులు పూర్తయ్యాయి. 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ జరుగుతున్నది. గతంలో శ్మశానవాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమస్యను పరిష్కరించేందుకు గ్రామగ్రామాన వైకుంఠధామం నిర్మించాలని నిర్ణయించాం. 12,742 గ్రామాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రైతులు పంటలను ఎండబెట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడత 93,875 చోట్ల కల్లాల నిర్మాణం చేపట్టాం.
పంచాయతీలకు కరెంటు బిల్లుల కష్టాలు తీర్చాం. క్రమం తప్పకుండా నెలానెలా రూ.308 కోట్లు పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నాం. గ్రామాల్లో పరిశుభ్రత పెరగడంతో డెంగీ యాయమైందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నేల విడిచి సాము చేయకుండా గ్రామాలనే కార్యవేదికగా గుర్తించాలి. గ్రామాలను గొప్పగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అడిషనల్ కలెక్టర్, డీపీఓలు తరచూ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించినప్పుడు కచ్చితంగా పల్లె ప్రగతి పనులను సమీక్షించి ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు.
మంత్రి దయాకర్ రావుకు అభినందన ..
పల్లె ప్రగతి కార్యక్రమంలో లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషితోనే ఇది సాధ్యమైందని సీఎం అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లెప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు శ్రమకోర్చి పనులు చేస్తున్నారని అన్నారు.
సంగారెడ్డి కలెక్టర్‌కు ప్రశంస..
అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరుశాతం నెరవేర్చిన సంగారెడ్డి కలెక్టర్ మంత్రిప్రగడ హన్మంతరావును సీఎం ప్రశంసించారు. జిల్లాలోని మొత్తం 647 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించి అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా నూటికి నూరుశాతం వైకుంఠధామాలు నిర్మించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బిగ్ రిలీఫ్ : భారీగా తగ్గిన బంగారం
- భారత్‌లో ‘మస్క్’ టెస్లా ఎంట్రీ చాలా హాట్ గురూ?!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- బుల్లెట్ల వర్షం కురిపించే బ్లాస్టింగ్ షూస్...!
- నితిన్ ‘చెక్’ విడుదల తేది ఖరారు
- రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
- సంప్రదాయ బడ్జెట్ హల్వా వేడుక రేపే
- తాండవ్ మేకర్లకు షాక్
- అందుబాటులో ఇసుక : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- థాయ్‌లాండ్ ఓపెన్..పీవీ సింధుకు షాక్