ఖిల్లాఘణపురం, ఆగస్టు 25 : పల్లెనిద్ర కార్యక్రమం ఓ చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం ఆముదంబండా తండాలో పల్లెనిద్ర చేశారు. గురువారం ఉదయం ఆయన ఆముదంబండా, గార్లబండ తండాల్లో మార్నింగ్‌వాక్ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వనపర్తి జిల్లాలో పల్లెనిద్ర చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమాలకు ఈ జిల్లానే నాంది అని తెలిపారు. సమస్యలను తెలుసుకొనేందుకు పల్లెనిద్ర ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తెలంగాణలో సాగునీరు పుష్కలంగా లభిస్తున్నదని, ఫలితంగా గతంలో ఉపాధి లేక వలస వెళ్లిన వారు నేడు సొంతూళ్లకు తిరిగి వస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. పల్లెనిద్రలో 50 శాఖల అధికారులు పాల్గొని నేరుగా ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు.
సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ): సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్ ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతులంతా ఈ దిశగా దృష్టి సారించాలని సూచించారు. గురువారం ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని ఐదారు రాష్ర్టాల్లోనే అన్ని రకాల పంటలు పండుతాయని, ఆ రాష్ర్టాల్లో పంటల సాగు పద్ధతులు, రైతులు, శాస్త్రవేత్తల అనుభవాలను తెలంగాణకు ఉపయోగపడేలా వాడుకోవాలన్నది తమ తాపత్రయమని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో వినూత్న పద్ధతులతో వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్నారని వెల్లడించారు. తెనాలి సమీపంలోని కొల్లిపరలో అరటి సాగును మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఉన్నారు.