హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : సీపీఐ జాతీయ సమితిలో తెలంగాణకు ప్రాధాన్యత లభించింది. జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్‌రెడ్డి తొలిసారి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా తప్పుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా వెంకట్‌రెడ్డి ఏఐఎస్ఎఫ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ కార్యదర్శి వరకు ఎదిగారు. కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా యూసుఫ్ ఎన్నికయ్యారు.
సీపీఐ జాతీయ సమితికి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులు ఎన్నికయ్యారు. వారిలో కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ, పల్లా వెంకట్ రెడ్డి, తకెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నర్సింహ, బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం బాలనర్సింహ, ఎస్కే సాబీర్ పాషా ఉన్నారు. క్యాండిడేట్ సభ్యుడిగా పాల్మాకుల జంగయ్య ఎన్నికయ్యారు.
చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ 25వ మహాసభ చివరిరోజు గురువారం ప్రతినిధులు సెంట్రల్ కంట్రోల్ కమిటీ సభ్యులుగా 11 మందిని ఎన్నుకున్నారు. సెంట్రల్ కమిటీ చైర్మన్‌గా కే నారాయణ, కార్యదర్శిగా రామ్బహేతిని ఎన్నుకున్నది.