హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేసిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్‌కు స్పష్టంగా చెప్పినట్టు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ తొలిరోజు సోమవారం స్పీకర్ చాంబర్లో నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తరఫు న్యాయవాదులు.. విచారణకు హాజరైన పిటిషనర్లు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం బయటకు వచ్చిన పల్లా అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదుతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున వచ్చిన అడ్వకేట్లు అసంబద్ధ ప్రశ్నలు వేశారని, అయినా ఓపికతో సమాధానాలు ఇచ్చామని వెల్లడించారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాల్సిందేనని స్పష్టంగా చెప్పామని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో బహిరంగంగా చేరారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో చేరలేదని కోర్టుకు, అసెంబ్లీ స్పీకర్‌కు అఫిడవిట్ ఇవ్వడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నట్టు, హస్తం పార్టీ కోసం ప్రచారం చేసినట్టు మీడియాలో వచ్చిన వార్తలను స్పీకర్‌కు ఇచ్చినట్టు తెలిపారు. ఆ 10 మంది పార్టీ మారారని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు అందజేసినట్టు చెప్పారు.