రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 5 గంటల కరెంట్ కూడ సరిగ్గా ఇవ్వకుండా ఎల్సీల పేరుతో కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రైతులను కరెంట్ కోసం పొట్టన పెట్టుకున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో ఒక రైతుకు కూడా కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు.
రేవంత్ సర్కార్ నాణ్యమైన బొగ్గును రాష్ర్టానికి వాడకుండా కర్ణాటక, ఏపీలకు అమ్ముకుంటున్నదని ధ్వజమెత్తారు. భూపాలపల్లిలోని 1100 మెగావాట్ల విద్యత్తు ఉత్పత్తికి సరిపడా బొగ్గును సింగరేణి అందుబాటులో ఉంచడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లను సగం ఉత్పత్తికి తగ్గించి వాటిని మూయించే కుట్ర సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు కమీషన్ల వేటలో ఉన్నారని ఎద్దేవా చేశారు.